ఐఎంఎఫ్‌ అంచనాలకు మించి భారత్‌ వృద్ధి

1 Nov, 2022 06:09 IST|Sakshi

6.8 శాతంపైనే ఉంటుందన్న సీఈఏ అనంత నాగేశ్వరన్‌  

న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2022–23 ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచనాలు 6.8 శాతం మించి నమోదవుతుందన్న విశ్వాసాన్ని చీఫ్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌ (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్‌ వ్యక్తం చేశారు. పెరుగుతున్న మూలధన పెట్టుబడులు తమ విశ్వాసానికి కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ నెల మొదట్లో భారత్‌ వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్‌  వరుసగా రెండోసారి తగ్గించింది. 

తొలుత ఈ ఏడాది జనవరిలో 2022–23లో వృద్ధి అంచనాలను 8.2 శాతంగా వెలువరించింది. అయితే జూలైలో దీనిని 7.4 శాతానికి కుదించింది. అంతర్జాతీయంగా అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు వంటి అంశాల నేపథ్యంలో రేటు అంచనాలను ఈ నెల మొదట్లో మరింతగా 6.8 శాతానికి ఐఎంఎఫ్‌ కుదించింది. ఈ నేపథ్యం అనంత నాగేశ్వరన్‌ సోమవారం చేసిన ఒక ప్రకటనలో తన తాజా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

► భారతదేశ పబ్లిక్‌ డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బహుశా ఒక కీలక మైలురాయిని దాటింది. ఇది పటిష్ట ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుతోపాటు  అధిక వృద్ధికి కూడా దోహదపడే అంశం.  
► ఆర్థిక,  ద్రవ్య విధానలు సాధారణంగా ఒకదానికి మరోటి అనుసంధానమై ఉంటాయి. ఒకదానికొకటి సమతుల్యత కలిగి ఉంటాయి.
► దేశీయ రుణం– జీడీపీ నిష్పత్తి విషయంలో ఆందోళన లేదు. అసెట్‌ మానిటైజేషన్‌ (నిరర్ధక ఆస్తుల నుంచి ఆర్థిక ప్రయోజనం) ఈ నిష్పత్తి మరింత తగ్గుతుంది. క్రెడిట్‌ రేటింగ్‌ పెరుగుదల విషయంలోనూ ఇది సానుకూల అంశం.  
► ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం, తయారీ, నిర్మాణంసహా అన్ని కీలక రంగాలూ మంచి పనితీరు ప్రదర్శిస్తున్నాయి.

మరిన్ని వార్తలు