వాహనాల తయారీకి ఊతం

26 Aug, 2021 02:16 IST|Sakshi

ఆటోమొబైల్‌ పరిశ్రమ

సమగ్రాభివృద్ధికి చర్యలు

ఆధునిక రవాణా వ్యవస్థకు కట్టుబడి ఉన్నాం

సియామ్‌ సదస్సులో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: దేశీయంగా వాహనాల తయారీకి మరింత ఊతమిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆటోమొబైల్‌ పరిశ్రమ ఉత్పాదకత మరింతగా పెరగడం, నిలకడగా వృద్ధి సాధించడంపై మరింతగా దృష్టి పెడుతోందని వివరించారు. స్వచ్ఛమైన ఇంధనాల వినియోగం, ఆధునిక రవాణా వ్యవస్థ ఏర్పాటుకు భారత్‌ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. దేశీ ఆటోమొబైల్‌ తయారీ సంస్థల సమాఖ్య సియామ్‌ 61వ వార్షిక సదస్సు సందర్భంగా పంపిన సందేశంలో ప్రధాని ఈ విషయాలు తెలిపారు.

సియామ్‌ ప్రెసిడెంట్‌ కెనిచి అయుకావా ఈ సందేశాన్ని చదివి వినిపించారు. ‘‘భారత ఆర్థిక వ్యవస్థ, దేశ పురోగతిలోనూ వాహన పరిశ్రమ ఎంతో కీలకపాత్ర పోషిస్తోంది. ఎగుమతులకు ఊతమిచ్చేలా తయారీ కార్యకలాపాలు మొదలుకుని అసంఖ్యాకంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ప్రజల జీవనాన్ని సులభతరం చేస్తోంది. దేశ అభివృద్ధి సాధనలో భాగస్వామిగా ఉంటోంది’’ అని ప్రధాని ప్రశంసించారు. ‘‘స్వచ్ఛమైన, ఆధునిక రవాణా వ్యవస్థ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగడానికి భారత్‌ కట్టుబడి ఉంది.

ఆటో రంగం ఉత్పాదకత పెరిగేందుకు, పరిశ్రమ నిలకడగా ఎదిగేందుకు.. వాహనాల తయారీకి సంబంధించిన వివిధ విభాగాలకు తోడ్పాటునిచ్చేందుకు సమగ్రమైన చర్యలు తీసుకుంటున్నాం’’ అని మోదీ వివరించారు. భారత్‌ను అంతర్జాతీయ తయారీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని,  ఇందులో ఆటో పరిశ్రమ పాత్ర కీలకంగా ఉంటుందని ఆయన తెలిపారు. సాంకేతికత, జీవన విధానాలు, ఆర్థిక వ్యవస్థలో చాలా వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని, పాత పద్ధతులను పక్కన పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త తరం మౌలిక సదుపాయాల కల్పన, ప్రపంచ స్థాయి తయారీ, ఆధునిక టెక్నాలజీ లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.  

జీడీపీలో 12 శాతానికి ఆటో వాటా: గడ్కరీ
స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) ఆటోమొబైల్‌ పరిశ్రమ వాటాను 12 శాతానికి పెంచాలని, కొత్తగా 5 కోట్ల కొలువులు సృష్టించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. ప్రస్తుతం జీడీపీలో ఆటో పరిశ్రమ వాటా 7.1 శాతంగా ఉంది. మరోవైపు, కాలుష్యకారకమైన డీజిల్‌ వాహనాల ఉత్పత్తి, అమ్మకాలను తగ్గించుకోవడంపై ఆటోమొబైల్‌ కంపెనీలు కసరత్తు చేయాలని, ప్రత్యామ్నాయ టెక్నాలజీల వైపు మొగ్గు చూపాలని గడ్కరీ సూచించారు. 100% పెట్రోల్‌ లేదా 100% బయో–ఇథనాల్‌తో నడిచే ఫ్లెక్స్‌ ఇంజిన్ల ఆధారిత వాహనాలను విస్తృతంగా వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే అమెరికా వంటి దేశాలతో పాటు భారత్‌లోనూ ఇలాంటి బ్రాండ్లు కొన్ని కార్యకలాపాలు సాగిస్తున్నాయని గడ్కరీ చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాలపై పరిశోధన, అభివృద్ధి కోసం పరిశ్రమ నిధులు వెచ్చించాలని తెలిపారు.

ఈవీ చార్జింగ్‌ సదుపాయాలపై కసరత్తు: కేంద్ర మంత్రి పాండే
విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే క్రమంలో దేశవ్యాప్తంగా చార్జింగ్‌ సదుపాయాలను కల్పించడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్‌ పాండే చెప్పారు. జాతీయ రహదారులు, నగరాల్లో వీటిని ఏర్పాటు చేయడంపై వివిధ శాఖలు, ప్రభుత్వ విభాగాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఇటు పన్నుల చెల్లింపుల్లోనూ, అటు మూడు కోట్ల మందికి పైగా జనాభాకు ఉపాధి కల్పించడంలో వాహన రంగం కీలకపాత్ర పోషిస్తోందని ఆయన ప్రశంసించారు.

ఆటో పరిశ్రమకు తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం రూ. 1.5 లక్షల కోట్లతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. వాహన రంగానికి అవసరమైన తోడ్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు పాండే తెలిపారు. మరోవైపు, ఆటోమొబైల్‌ పరిశ్రమ తోడ్పాటు లేకుండా భారత్‌ సుదీర్ఘకాలం అధిక వృద్ధి రేటుతో పురోగమించడం సాధ్యపడేది కాదని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ తెలిపారు. విద్యుత్‌ వాహనాల వైపు మళ్లడం ఎప్పటికైనా తప్పదని, ఈ రంగంలో భారత్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ఆటో పరిశ్రమ కృషి చేయాలని సూచించారు.

మాటలు కాదు.. చేతలు కావాలి: పరిశ్రమ దిగ్గజాలు
ఆటో పరిశ్రమ వృద్ధికి చర్యల విషయంలో ప్రభుత్వ అధికారుల ధోరణులను సియామ్‌ సదస్సులో పరిశ్రమ దిగ్గజాలు ఆక్షేపించారు. నానాటికీ క్షీణిస్తున్న ఆటోమొబైల్‌ రంగం పునరుద్ధరణకు నిర్మాణాత్మకమైన చర్యలు అవసరమని, కేవలం మాటల వల్ల ఉపయోగం లేదని మారుతీ సుజుకీ చైర్మన్‌ ఆర్‌సీ భార్గవ, టీవీఎస్‌ మోటార్‌ చీఫ్‌ వేణు శ్రీనివాసన్‌ తదితరులు వ్యాఖ్యానించారు. అసలు దేశాభివృద్ధిలో ఆటోపరిశ్రమ పోషిస్తున్న పాత్రకు కనీసం గుర్తింపైనా ఉంటోందా అన్న సందేహాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. ‘‘ఆటో పరిశ్రమ చాలాకాలంగా క్షీణ బాటలో కొనసాగుతోంది.

పరిశ్రమ ప్రాధాన్యతపై ఎన్నో ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. కానీ, క్షీణతను అడ్డుకునే నిర్మాణాత్మక చర్యల విషయానికొస్తే మాత్రం క్షేత్రస్థాయిలో ఏమీ కనిపించడం లేదు. కొత్త కాలుష్య ప్రమాణాలను, భద్రతా ప్రమాణాలను పాటించేందుకు కంపెనీలు గణనీయంగా వ్యయాలు చేయాల్సి వస్తుండటం, భారీ పన్నుల భారం వల్ల వాహనాల ఖరీదు పెరిగిపోతోంది. దీంతో వినియోగదారులకు అవి అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఫలితంగా అమ్మకాలపై ప్రభావం పడుతోంది.

ఈ సమస్యను పరిష్కరించకుండా బయో ఇంధనాలు, ఎలక్ట్రిక్‌ వాహనాలు అంటూ ఏది చేసినా కార్ల పరిశ్రమ కోలుకుంటుందని అనుకోవడం లేదు’’ అని భార్గవ పేర్కొన్నారు. మరోవైపు, దేశంలో ప్రాథమిక రవాణా సాధనంగా ఉంటున్న ద్విచక్ర వాహనాలపై సైతం విలాస ఉత్పత్తులకు సరిసమానంగా ఏకంగా 28 శాతం వస్తు, సేవల పన్ను విధించడం సరికాదని వేణు శ్రీనివాసన్‌ వ్యాఖ్యానించారు. దేశీ ఆటోమొబైల్‌ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకుని దేశీయంగానే తయారీ, డిజైనింగ్‌ కార్యకలాపాలపై గణనీయంగా ఇన్వెస్ట్‌ చేస్తోందని ఆయన చెప్పారు. ఇంత చేస్తున్నా తమకు గుర్తింపనేది లభిస్తోందా అన్న సందేహం కలుగుతోందన్నారు.

మరిన్ని వార్తలు