టెస్లా ఎలక్ట్రిక్ కార్ల ప్రియులకు తీపికబురు

9 Aug, 2021 18:15 IST|Sakshi

టెస్లా ఎలక్ట్రిక్ కార్ల ప్రియులకు కేంద్రం తీపికబురు అందించనున్నట్లు తెలుస్తుంది. గత నెల జూలైలో ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా తమ కార్లపై దిగుమతి సుంకాలను తగ్గించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసిన సంగతి అందరికీ తెలిసిందే. టెస్లా విజ్ఞప్తిపై కేంద్రం ఇప్పటికీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, తాజాగా ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి సుంకాలను 40% వరకు తగ్గించాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు ఇద్దరు సీనియర్ ప్రభుత్వ అధికారులు రాయిటర్స్ తో పేర్కొన్నారు. కారు ఖర్చు, బీమా, సరుకు రవాణాతో సహా $40,000 కంటే తక్కువ విలువ కలిగిన దిగుమతి చేసుకున్న ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)పై ప్రభుత్వం పన్ను రేటును ప్రస్తుతం ఉన్న 60 శాతం నుంచి 40 శాతానికి తగ్గించడం గురించి చర్చిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

$40,000 కంటే ఎక్కువ విలువ కలిగిన ఈవీ కార్లపై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని 100% నుంచి 60%కి తగ్గించాలని చూస్తోందని వారు తెలిపారు. సుమారు 3 మిలియన్ వాహనాల వార్షిక అమ్మకాలతో భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద కార్ల మార్కెట్ గా ఉంది. కానీ, విక్రయించిన కార్లలో ఎక్కువ భాగం $20,000 కంటే తక్కువ ధర కలిగి ఉన్నాయి. మొత్తం అమ్మకాలలో లగ్జరీ ఈవీ అమ్మకాలు స్వల్పంగా ఉన్నాయని పరిశ్రమ అంచనాలు చెబుతున్నాయి. ఈవీలపై దిగుమతి సుంకాలను 40 శాతానికి తగ్గించడం వల్ల అవి మరింత సరసమైనవిగా మారడంతో అమ్మకాలను పేరుగుతాయని టెస్లా పేర్కొంది. ఈవీ కార్లపై విధిస్తున్న దిగుమతి సుంకం తగ్గించడాన్ని దేశంలో సరసమైన ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసే టాటా మోటార్స్, ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేస్తున్న ఓలా ఎలక్ట్రిక్ వ్యతిరేకిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో ఈ దిగుమతి సుంకలపై కేంద్రం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు