Hurun India Unicorn List: ఆ విషయంలో బ్రిటన్‌ని వెనక్కి నెట్టిన భారత్‌!

23 Dec, 2021 08:43 IST|Sakshi

యూనికార్న్‌ దేశాల్లో భారత్‌ పైపైకి 

జాబితాలో బ్రిటన్‌ను దాటి 3వ స్థానంలోకి 

మొత్తం 54కి చేరిన సంఖ్య హురున్‌ రీసెర్చ్‌ నివేదిక  

ముంబై: అత్యధిక సంఖ్యలో యూనికార్న్‌ సంస్థలున్న దేశాల జాబితాలో భారత్‌ 3వ స్థానానికి ఎగబాకింది. ఈ విషయంలో బ్రిటన్‌ను అధిగమించింది. ఈ ఏడాదే కొత్తగా మరో 33 అంకుర సంస్థలు యూనికార్న్‌లుగా ఎదగడంతో ఇది సాధ్యపడింది. 1 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 7,500 కోట్లు) వేల్యుయేషన్‌ దక్కించుకున్న సంస్థలను యూనికార్న్‌లుగా వ్యవహరిస్తారు. గతేడాది ఆఖరు నాటికి ఈ విషయంలో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. ప్రస్తుత ఏడాది ఈ సంఖ్య 54కి చేరింది. బ్రిటన్‌లో కొత్తగా 15 సంస్థలు యూనికార్న్‌లుగా మారడంతో.. అక్కడ మొత్తం సంఖ్య 39కి చేరింది. హురున్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం అమెరికా, చైనా టాప్‌లో కొనసాగుతున్నాయి. భారత్‌ మూడో ‍ స్థానంలో ఉంది. ఇదే జోరు కొనసాగితే ఇండియా నెక్ట్స్‌ టార్గెట్‌ చైనాను అధిగమించడమే అవుతుంది.

అమెరికా నంబర్‌ 1
ఈ ఏడాది కొత్తగా 254 యూనికార్న్‌లు పుట్టుకురాగా మొత్తం 487 కంపెనీలతో అమెరికా నంబర్‌ వన్‌గా నిల్చింది. ఇక చైనాలో మరో 74 సంస్థల రాకతో యూనికార్న్‌ హోదా దక్కించుకున్న స్టార్టప్‌ల సంఖ్య 301కి చేరింది. తద్వారా చైనా రెండో స్థానంలో నిల్చింది. మొత్తం యూనికార్న్‌ ప్రపంచంలో ఈ రెండు దేశాల వాటా ఏకంగా 74 శాతంగా ఉంది. 

673 కొత్త సంస్థలు
ఈసారి లిస్టులో 673 కొత్త సంస్థలు స్థానం దక్కించుకోగా, 201 సంస్థలు చోటు కోల్పోయాయి. వేల్యుయేషన్స్‌ 1 బిలియన్‌ డాలర్ల దిగువకి పడిపోవడంతో 39 కంపెనీలు హోదా కోల్పోయాయి. స్టాక్‌ ఎక్సే్చంజీల్లో లిస్ట్‌ కావడం లేదా ఇతర సంస్థలు కొనుగోలు చేయడం వంటి కారణాలతో 162 సంస్థలను యూనికార్న్‌ లిస్టు నుంచి తప్పించారు. 

అగ్రస్థానంలో బైజూస్‌.. 
దేశీ యూనికార్న్‌ల జాబితాలో 21 బిలియన్‌ డాలర్ల వేల్యుయేషన్‌తో ఎడ్‌టెక్‌ స్టార్టప్‌ బైజూస్‌ నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. ఇన్‌మొబి (12 బిలియన్‌ డాలర్లు), ఓయో (9.5 బిలియన్‌ డాలర్లు), రేజర్‌పే (7.5 బిలియన్‌ డాలర్లు) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇక నగరాలవారీగా చూస్తే బెంగళూరులో అత్యధికంగా యూనికార్న్‌లు ఉన్నాయి. ‘భారత్‌ ప్రస్తుతం స్టార్టప్‌ బూమ్‌ మధ్యలో ఉంది. అధికారికంగా యూనికార్న్‌ల సంఖ్య రెట్టింపైంది‘ అని హురున్‌ రిపోర్ట్‌ ఇండియా ఎండీ అనాస్‌ రెహ్మాన్‌ జునైద్‌ తెలిపారు. ఈ శతాబ్దంలో ప్రారంభమై యూనికార్న్‌లుగా ఎదిగిన సంస్థలను ఈ అధ్యయనంలో పరిగణనలోకి తీసుకున్నారు.  

చదవండి: 
 

మరిన్ని వార్తలు