2022 మార్చి 31 నాటికి దేశ అప్పు ఎంతంటే..!

6 Dec, 2021 17:32 IST|Sakshi

భారత రుణభారంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం లోక్‌సభలో పేర్కోంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే (మార్చి 31, 2022)నాటికి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో  దేశ రుణం  62 శాతంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. 
 
ఆర్థిక లోటు, రుణభారాలపై నజర్‌..!
సోమవారం లోక్‌సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానంలో, దేశ రుణ భారాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం పలు చర్యలను తీసుకుంటుందని వెల్లడించారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా మెరుగైన సమ్మతి ద్వారా పన్ను రాబడిని పెంచడం, ఆస్తుల మానటైజేషన్ ద్వారా వనరుల సమీకరణ, ప్రభుత్వ వ్యయ సమర్థతను మెరుగుపరచడం మొదలైనవి ఆర్థిక లోటు, రుణ భారాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం ప్రారంభించిన ముఖ్యమైన చర్యలని చౌదరి చెప్పారు.
 
పుంజుకున్న ఆదాయాలు..!
2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక లోటు జీడీపీలో 6.8 శాతంగా ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో అంచనా వేశారు. ఫిచ్ రేటింగ్స్ ప్రకారం... ప్రభుత్వం ఆశించిన దానికంటే బలంగా ఆదాయం పుంజుకోవడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 6.6 శాతం ఆర్థిక లోటు ఉంటుందని తెలిపినట్లు పంకజ్‌ చౌదరీ అన్నారు.  

అంచనాలకు మించి..!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాల ప్రకారం ఎఫ్‌వై22లో భారత ఆర్థిక వ్యవస్థ 9.5 శాతం వృద్ధి చెందుతుందని పంకజ్‌ అభిప్రాయపడ్డారు. దాంతో పాటుగా ఐఎమ్‌ఎఫ్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఔట్‌లుక్‌ అప్‌డేట్‌ గురించి ప్రస్తావించారు. భారత్‌ 2021లో 9.5 శాతం, 2022లో 8.5 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసిందనే విషయాలను చౌదరి లోక్‌సభలో వెల్లడించారు.
చదవండి: ఏటీఎం ‘విత్‌డ్రా బాదుడు’.. 21రూ. మించే! ఇంతకీ ఆర్బీఐ ఏం చెప్పిందంటే..

మరిన్ని వార్తలు