డిజిటల్‌ కరెన్సీపై ఆచితూచి నిర్ణయం

8 Apr, 2022 06:52 IST|Sakshi

ఆర్‌బీఐ డిప్యుటీ గవర్నర్‌ రవి శంకర్‌

న్యూఢిల్లీ: ప్రతిపాదిత సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ)ని ప్రవేశపెట్టే విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందని రిజర్వ్‌ బ్యాంక్‌ డిప్యుటీ గవర్నర్‌ టి. రవి శంకర్‌ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్‌ రంగం, ద్రవ్య పరపతి విధానంపై డిజిటల్‌ కరెన్సీ ప్రభావాలను లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు.

రిస్కీ సాధనాలైన క్రిప్టోకరెన్సీలను కట్టడి చేసే విధంగా బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ ఆధారిత డిజిటల్‌ కరెన్సీని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టడంపై ఆర్‌బీఐ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో శంకర్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటివరకూ అధికారికంగా ఎక్కడా డిజిటల్‌ కరెన్సీ వినియోగంలో లేనందున దాని ప్రభావాలను ముందుగా అంచనా వేయగలిగే పరిస్థితి లేదని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇతర సెంట్రల్‌ బ్యాంకులు కూడా దీని విషయంలో క్రమానుగతంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. సీబీడీసీలతో ఒనగూరే ప్రయోజనాల వల్ల బ్యాంకింగ్‌ వ్యవస్థలో డిపాజిట్ల డిమాండ్‌పై, తత్ఫలితంగా రుణ వితరణ సామర్థ్యాలపై ప్రతికూల ప్రభావం పడవచ్చని శంకర్‌ అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు