అమెరికన్‌ కంపెనీలపై వివక్ష లేదు

4 Feb, 2021 06:10 IST|Sakshi

యూఎస్‌టీఆర్‌ నివేదిక ఆమోదయోగ్యం కాదు

ఈ–కామర్స్‌ ట్యాక్స్‌పై వాణిజ్య శాఖ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: విదేశీ ఈ–కామర్స్‌ సంస్థలపై రెండు శాతం పన్ను విధింపు విధానంతో అమెరికన్‌ కంపెనీల పట్ల వివక్ష చూపుతున్నారన్న ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. దీనిపై అమెరికా ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌ (యూఎస్‌టీఆర్‌) నివేదికలో పొందుపర్చిన అంశాలు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్‌ వాధ్వాన్‌ స్పష్టం చేశారు. ఈ–కామర్స్‌ సరఫరాలపై భారత్‌ రెండు శాతం డిజిటల్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌ విధించడం అమెరికన్‌ కంపెనీల పట్ల వివక్ష చూపటమేనని, ఇది అంతర్జాతీయ పన్ను సూత్రాలకు విరుద్ధమని యూఎస్‌టీఆర్‌ గత నెల ఒక నివేదికలో పేర్కొంది. దీనిపైనే తాజాగా వాధ్వాన్‌ స్పందించారు. విదేశీ సంస్థలు .. బిలియన్ల డాలర్ల కొద్దీ ఆదాయాలు పొందుతున్న దేశాల్లో పన్నులు చెల్లించడం తప్పదని ఆయన పేర్కొన్నారు. ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనమిక్‌ కో–ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఈసీడీ) దేశాలు కూడా ఇదే దిశగా చర్యలు తీసుకుంటున్నాయని వాధ్వాన్‌ వివరించారు. ఫేస్‌బుక్, గూగుల్, అమెజాన్‌ వంటి సంస్థల రూపంలో ఆయా రంగాల్లో ఆధిపత్యం ఉన్నందునే కొన్ని దేశాలు ఇలాంటి పన్నులను వ్యతిరేకిస్తున్నాయని ఆయన చెప్పారు.  

మినీ వాణిజ్య ఒప్పందంపై చర్చలు..
అమెరికా, భారత్‌ మధ్య ప్రతిపాదిత మినీ వాణిజ్య ఒప్పందంపై స్పందిస్తూ .. పలు అంశాలపై ఇరు దేశాల చర్చలు కొనసాగుతూనే ఉంటాయని, వీటికి ముగింపు ఉండదని వాధ్వాన్‌ తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింతగా పెంచుకునే దిశగా ప్రతిబంధకంగా ఉన్న కొన్ని వివాదాలను పరిష్కరించుకోవడంపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌ (జీఎస్‌పీ) కింద తమ ఎగుమతులకు ప్రాధాన్యత హోదాను పునరుద్ధరించాలని అమెరికాను భారత్‌ కోరుతోంది. మరోవైపు, వ్యవసాయం, తయారీ, డెయిరీ, వైద్య పరికరాలు తదితర విభాగాల్లో తమ కంపెనీలను మరింత విస్తృతంగా అనుమతించాలని అమెరికా కోరుతోంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు