రెట్టింపు స్థాయికి చమురు, గ్యాస్‌ అన్వేషణ

5 Feb, 2022 06:28 IST|Sakshi

2025 నాటికి లక్ష్యం

హరిత హైడ్రోజన్‌ హబ్‌గా మారనున్న భారత్‌

కేంద్ర పెట్రోలియం మంత్రి పురి వెల్లడి

న్యూఢిల్లీ: ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం, దేశీయంగా ఉత్పత్తిని పెంచుకోవడంపై కేంద్రం మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా గ్యాస్, చమురు అన్వేషణ, ఉత్పత్తి చేసే ప్రాంత విస్తీర్ణాన్ని 2025 నాటికల్లా రెట్టింపు స్థాయికి (5 లక్షల చ.కి.మీ.లకు) పెంచుకోవాలని భావిస్తోంది. 2030 నాటికి దీన్ని 10 లక్షల చ.కి.మీ.కు పెంచనున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి తెలిపారు.

ప్రస్తుతం 2,07,692 చ.కి.మీ. విస్తీర్ణంలో చమురు, గ్యాస్‌ అన్వేషణ జరుగుతోంది. సమీప భవిష్యత్తులో దేశ ఇంధన అవసరాల కోసం చమురు, గ్యాస్‌పై ఆధారపడటం కొనసాగుతుందని వరల్డ్‌ ఎనర్జీ పాలసీ సదస్సు 2022లో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు. ప్రస్తుతం 3 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న భారత ఎకానమీ 2025 నాటికల్లా 5 లక్షల కోట్ల డాలర్లకు, 2030 నాటికి 10 లక్షల కోట్ల డాలర్లకు చేరనుందని పురి వివరించారు.

ఈ నేపథ్యంలో ఇంధనానికి భారీగా డిమాండ్‌ ఏర్పడుతుందని చెప్పారు. బ్రిటీష్‌ ఇంధన సంస్థ బీపీ ఎనర్జీ అంచనాల ప్రకారం 2050 నాటికి ప్రపంచ ఇంధన డిమాండ్‌లో భారత్‌ వాటా ప్రస్తుత 6 శాతం స్థాయి నుంచి రెట్టింపై 12 శాతానికి చేరుతుందని ఆయన పేర్కొన్నారు. నికరంగా సున్నా స్థాయి కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు.  

భారత్‌ 80 శాతం పైగా ఇంధనావసరాల కోసం బొగ్గు, చమురు, బయోమాస్‌పైనే ఆధారపడుతోంది. మొత్తం ఇంధన వినియోగంలో 44 శాతం వాటా బొగ్గుది ఉంటుండగా, చమురుది పావు శాతం, సహజ వాయువుది 6 శాతం వాటా ఉంటోంది. చమురు అవసరాల్లో 85 శాతాన్ని, గ్యాస్‌లో 50 శాతాన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.  

గ్యాస్‌ వినియోగం పెంపు..
చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే క్రమంలో గ్యాస్‌ ఇంధన వినియోగాన్ని పెంచుకుంటున్నట్లు పురి తెలిపారు. ప్రస్తుతం 6 శాతంగా ఉన్న గ్యాస్‌ వాటాను 2030 నాటికి 15 శాతానికి పెంచుకోనున్నట్లు వివరించారు. అలాగే చెరకు, మిగులు ఆహారధాన్యాల నుంచి వెలికితీసే ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలపడం ద్వారా కూడా చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం బ్లెండింగ్‌ (పెట్రోల్‌లో ఇథనాల్‌ కలిపే స్థాయి) 8 శాతంగా ఉండగా 2025 నాటికి ఇది 20 శాతానికి పెంచుకోనున్నట్లు హర్‌దీప్‌ సింగ్‌ పురి చెప్పారు. మరోవైపు, కాలుష్య రహితమైన ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కూడా తగు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు.

   ‘పర్యావరణ హైడ్రోజన్‌ను వేగవంతంగా వినియోగంలోకి తేవడంపైనా, భారత్‌ను హరిత హైడ్రోజన్‌ హబ్‌గా తీర్చిదిద్దడంపైనా ప్రధానంగా దృష్టి పెడుతున్నాం. హైడ్రోజన్‌ను ఇంధనంగాను, గ్యాస్‌ పైప్‌లైన్‌లలోను ఉపయోగించగలిగే ప్రాజెక్టులను మా చమురు, గ్యాస్‌ కంపెనీలు రూపొందిస్తున్నాయి ‘ అని పురి చెప్పారు. దేశీయంగా చమురు, గ్యాస్‌ రంగంలో తలపెట్టిన సంస్కరణలు ఏదో స్వల్పకాలికమైనవి కాదని.. అపార వనరులను సమర్ధంగా వినియోగించుకునేందుకు రూపొందించుకున్న దీర్ఘకాలిక ప్రణాళికలో భాగమేనని ఆయన పేర్కొన్నారు. పరిశుభ్రమైన, పర్యావరణ అనుకూలమైన ఇంధనానికి మళ్లడంలో ప్రపంచానికి భారత్‌ నాయకత్వం వహించగలదని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు