12 శాతానికి భారత ఆర్థిక వృద్ధి రేటు!

20 Mar, 2021 01:17 IST|Sakshi

2021పై మూడీస్‌ అంచనాలు పెంపు

న్యూఢిల్లీ: భారత జీడీపీ 2021లో 12 శాతం మేర వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ అంచనా వేసింది. సమీప కాలంలో పరిస్థితులు భారత్‌కు ఎంతో సానుకూలంగా ఉన్నట్టు ఈ సంస్థ పేర్కొంది. 2020 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశ జీడీపీ మైనస్‌ 7.5 శాతానికి పడిపోయిన తర్వాత.. డిసెంబర్‌ త్రైమాసికంలో 0.4 శాతం వృద్ధిలోకి చేరుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్‌ క్వార్టర్‌ వృద్ధి రేటు అంచనాలకు మించి ఉన్నట్టు మూడీస్‌ పేర్కొంది. ‘‘ప్రైవేటు వినియోగం, నివాసేతర పెట్టుబడులు వచ్చే కొన్ని త్రైమాసికాల్లో చెప్పుకోతగ్గ స్థాయిలో పుంజుకుంటాయి. ఇది 2021లో దేశీయ డిమాండ్‌ పుంజుకునేందుకు సాయపడుతుంది’’ అని మూడీస్‌ తన తాజా నివేదికలో వివరించింది.

క్రితం సంవత్సరంలో జీడీపీ కనిష్టాలకు పడిపోయినందున.. అక్కడి నుంచి చూసుకుంటే 2021 సంవత్సరంలో భారత వాస్తవ జీడీపీ వృద్ధి 12 శాతంగా ఉంటుందని తెలిపింది. కరోనాకు ముందున్న వృద్ధితో (2020 మార్చి త్రైమాసికం) పోలిస్తే ఇది 4.4 శాతం ఎక్కువ. ద్రవ్య, పరపతి విధానాలు వృద్ధికి అనుకూలంగానే ఉంటాయన్న అభిప్రాయాన్ని మూడీస్‌ వ్యక్తం చేసింది. ఈ ఏడాది అదనపు రేట్ల కోతలను అంచనా వేయడం లేదని పేర్కొంది. దేశీయ వినియోగాన్ని చూసి అవసరమైతే ద్వితీయ అర్ధ సంవత్సరంలో కొంత ద్రవ్యపరమైన మద్దతు అవసరం కావచ్చని అంచనా వేసింది. అయితే, 2021లో రికవరీ కరోనా కేసుల మలివిడత తీవ్రతపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. కరోనా రెండో విడత కేసుల తీవ్రత కొన్ని రాష్ట్రాల పరిధిలోనే ఎక్కువగా ఉన్నందున కట్టడికి అవకాశం ఉంటుందని పేర్కొంది.  

11 శాతం వృద్ధి అవసరం: నీతి ఆయోగ్‌
భారత్‌ రానున్న ఆర్థిక సంవత్సరంలో (2021–22) 10.5–11 శాతం స్థాయిలో వాస్తవ వృద్ధి రేటును చేరుకోవాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ అన్నారు. మరోసారి వచ్చే మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్‌ సన్నద్ధంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. నేషనల్‌ సీఎస్‌ఆర్‌ నెట్‌వర్క్‌ వర్చువల్‌గా నిర్వహించిన ఒక కార్యక్రమంలో రాజీవ్‌కుమార్‌ మాట్లాడారు.

మరిన్ని వార్తలు