వంట నూనెల దిగుమతులు పెరిగాయ్‌

15 Nov, 2022 10:25 IST|Sakshi

న్యూఢిల్లీ: వంట నూనెల దిగుమతుల విలువ అక్టోబర్‌తో ముగిసిన సంవత్సరంలో రూ.1.57 లక్షల కోట్లకు చేరుకుంది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 34.18 శాతం అధికం కావడం గమనార్హం. సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఈఏ) ప్రకారం.. విదేశాల నుంచి భారత్‌కు దిగుమతి అయిన∙వంట నూనెల పరిమాణం 6.85 శాతం అధికమై 140.3 లక్షల టన్నులుగా ఉంది.

2020–21 నవంబర్‌–అక్టోబర్‌లో 131.3 లక్షల టన్నుల నూనెలు భారత్‌కు వచ్చి చేరాయి. వీటి విలువ రూ.1.17 లక్షల కోట్లు. 2021–22 నవంబర్‌–అక్టోబర్‌ కాలానికి పామ్‌ ఆయిల్‌ దిగుమతులు 4 లక్షల టన్నులు తగ్గి 79 లక్షల టన్నులుగా ఉంది. ధరల అధిక అస్థిరత ఈ తగ్గుదలకు కారణం. ఆర్‌బీడీ పామోలిన్‌ దాదాపు మూడింతలై 18.4 లక్షల టన్నులకు చేరింది. ముడి పామాయిల్‌ 20 శాతం క్షీణించి 59.94 లక్షల టన్నులు నమోదైంది.

సాఫ్ట్‌ ఆయిల్స్‌ 48.12 లక్షల టన్నుల నుంచి 61.15 లక్షల టన్నులకు ఎగసింది. సాఫ్ట్‌ ఆయిల్స్‌లో సోయాబీన్‌ 28.66 లక్షల టన్నుల నుంచి 41.71 లక్షల టన్నులు, సన్‌ఫ్లవర్‌ స్వల్పంగా అధికమై 19.44 లక్షల టన్నులకు చేరింది. నవంబర్‌ 1 నాటికి దేశంలో 24.55 లక్షల టన్నుల వంట నూనెల నిల్వలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా నెలకు 19 లక్షల టన్నుల నూనె వినియోగం అవుతోంది. ముడి పామాయిల్, ఆర్‌బీడీ పామోలిన్‌ అధికంగా ఇండోనేషియా, మలేషియా నుంచి సరఫరా అవుతోంది.

చదవండి: కేం‍ద్రం భారీ షాక్‌: పది లక్షల రేషన్‌ కార్డులు రద్దు, కారణం ఏంటంటే..

మరిన్ని వార్తలు