రూ.9,75,600 కోట్ల ఎగుమతులు

1 Oct, 2022 06:36 IST|Sakshi

ఎలక్ట్రానిక్స్‌పై కేంద్రం అంచనా

చెన్నై: దేశం నుంచి 2025–26 నాటికి ఎలక్ట్రానిక్స్‌ ఎగుమతులు రూ.9,75,600 కోట్లకు చేరతాయని కేంద్రం ఆశిస్తోంది. భారత్‌లో ఎలక్ట్రానిక్స్‌ తయారీ విలువ రూ.6,09,750 కోట్లుగా అంచనా. 2026 మార్చినాటికి తయారీ విలువ రూ.24,39,000 కోట్లకు చేరుకోవాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. చెన్నై సమీపంలో రూ.1,100 కోట్లతో పెగాట్రాన్‌ టెక్నాలజీ ఇండియా నెలకొల్పిన ప్లాంటును శుక్రవారం ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘2014 నాటికి భారత్‌ 90 శాతం మొబైల్‌ ఫోన్స్‌ను దిగుమతి చేసుకుంది.

ప్రస్తుతం భారత్‌లో అమ్ముడవుతున్న మొబైల్స్‌లో 97 శాతం దేశీయంగా తయారైనవే. ఏటా రూ.50,000 కోట్ల విలువైన ఫోన్లను ఎగుమతి చేస్తున్నాం. వీటిలో ఐఫోన్స్, శామ్‌సంగ్, ఇతర బ్రాండ్స్‌ ఉన్నాయి. ఎనమిదేళ్లలో సున్నా నుంచి ఈ స్థాయికి వచ్చాం. భారత్‌ సాధించింది అతి స్వల్పమే. 2025–26 నాటికి రూ.1,62,600 కోట్ల విలువైన మొబైల్స్‌ భారత్‌ నుంచి విదేశాలకు సరఫరా అవుతాయని భావిస్తున్నాం. పెగాట్రాన్‌ సదుపాయాన్ని ప్రారంభించడం, నోయిడా, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో అనేక ఇతర తయారీ యూనిట్ల విజయం.. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు నిశ్చయించుకున్నాయని ప్రపంచానికి సందేశం ఇచ్చింది’ అని రాజీవ్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు