Piyush Goyal: ఈయూతో ఎఫ్‌టీఏ దిశగా అడుగులు

7 May, 2022 05:19 IST|Sakshi

వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటన

2023 నాటికి సాకారమవుతుందని వెల్లడి  

ముంబై: యూరోపియన్‌ యూనియన్‌తో (ఈయూ) వచ్చే ఏడాది నాటికి భారత్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) కుదుర్చుకుంటుందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌  తెలిపారు. ఐఎంసీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..  

► దేశం ఇప్పటికే యునైటెడ్‌ అరబ్‌ ఎమిరైట్స్‌ (యూఏఈ), ఆస్ట్రేలియాతో ఒప్పందాలు కుదుర్చుకుంది. యూరోపియన్‌ యూనియన్, బ్రిటన్, కెనడా, గల్ఫ్‌ కోఆపరేషన్‌ కౌన్సిల్‌ (జీసీసీ)సహా ఇతర దేశాలు లేదా బ్లాక్‌లతో ఎఫ్‌టీఏపై చర్చలు జరుపుతోంది.  
► ఇటలీకి చెందిన విదేశాంగ మంత్రితో సహా ఒక ప్రతినిధి బృందం దేశ రాజధానితో  పర్యటిస్తోంది. ఎఫ్‌టీఏపై ఈ సందర్భంగా చర్చలు జరగనున్నాయి.  
► ఇప్పటికే బ్రిటన్‌తో మూడు దఫాల చర్చలు జరిగాయి. త్వరలో నాలుగో రౌండ్‌ చర్చలు జరిగే అవకాశం ఉంది. మే 26–27 తేదీల్లో బ్రిటన్‌ ప్రతినిధులతో కీలక సమావేశం జరగనుంది.  
► స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు భారతదేశంలో వృద్ధిని పెంచుతాయి. భారీ ఉపాధి కల్పనకు వీలు కలుగుతుంది. భారత్‌ ఇతర దేశాలు లేదా కూటములతో న్యాయమైన, పరస్పర ప్రయోజనకరమైన, విజయవంతమైన భాగస్వామ్యాల కోసం ఎదురు చూస్తోంది.
► 2021–22 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 400 బిలియన్‌ డాలర్లకుపైగా ఎగుమతులు జరిపి రికార్డు సృష్టించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో దేశం ఎన్నడూ లేని విధంగా 38 బిలియన్‌ డాలర్ల ఎగుమతులను నమోదు చేసింది.  ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు రికార్డు స్థాయి ఎగుమతులు నమోదవుతాయన్న విశ్వాసం ఉంది. అత్యంత నాణ్యతా ప్రమాణాలు కలిగిన ఉత్పత్తుల తయారీ కేంద్రంగా భారత్‌ అభివృద్ధి చెందుతోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.  
► ప్రొడక్ట్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్,  మౌలిక రంగం పురోగతికి చర్యల తత్సబంధ కార్యక్రమాల ద్వారా దేశం ఆశించిన ఫలితాలను సాధిస్తోంది.  
► ఏప్రిల్‌లో చరిత్రాత్మక రికార్డు స్థాయలో రూ. 1.67 లక్షల కోట్లకు పైగా వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్ల జరిగాయి. విశ్లేషకుల అంచనాలను మించి ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం ఆశాజనకం. పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌లు కూడా ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన రికవరీ, పునరుద్ధరణను సూచిస్తున్నాయి.  
► 2021లో దేశం 82 బిలియన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఏ) ఆకర్షించింది. ఇది ఎన్నడూ లేనంత అత్యధికం.  చట్టబద్ధమైన పాలన,  ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ, పారదర్శక న్యాయ వ్యవస్త, వ్యాపారాలను ఆకర్షించే స్థిరమైన విధానాల వంటి అంశాలు ఈ రికార్డుల సాధనకు కారణం.   

ఆస్ట్రేలియా దిగుమతుల్లో కొన్నింటికే సుంకాల మినహాయింపు
ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకునే వాటిల్లో 29.8 శాతం ఉత్పత్తులకు సుంకాలపరమైన మినహాయింపులు వర్తించవని కేంద్రం వెల్లడించింది. డైరీ ఉత్పత్తులు, ఆహార ధాన్యాలు, విలువైన లోహాలు, ఆభరణాలు మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. దేశీ పరిశ్రమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మినహాయింపులు వర్తించే ఉత్పత్తుల జాబితా నుంచి వీటిని తొలగించినట్లు కేంద్రం తెలిపింది. భారత్‌–ఆస్ట్రేలియా మధ్య కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (ఇండ్‌ఆస్‌ ఈసీటీఏ) సంబంధించిన సందేహాల నివృత్తి కోసం వాణిజ్య శాఖ ఈ మేరకు వివరణ (ఎఫ్‌ఏక్యూ) జారీ చేసింది. ఏప్రిల్‌ 2న కుదిరిన ఈ ఒప్పందం ఇంకా అమల్లోకి రావాల్సి ఉంది. ఎఫ్‌ఏక్యూ ప్రకారం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుత 27.5 బిలియన్‌ డాలర్ల నుంచి 45–50 బిలియన్‌ డాలర్లకు చేరనుంది. ఇండ్‌ఆస్‌ ఈసీటీఏతో వచ్చే 5–7 ఏళ్లలో 10 లక్షల పైగా ఉద్యోగాల కల్పన జరగనుంది.   

మరిన్ని వార్తలు