భారత్‌ వృద్ధి రేటు 7 శాతానికి కోత: క్రిసిల్‌

22 Nov, 2022 08:26 IST|Sakshi

ముంబై: భారత్‌ 2022–23 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ 30 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) తగ్గించింది. దీనితో ఇందుకు సంబంధించి క్రిసిల్‌ అంచనా 7 శాతానికి తగ్గింది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ప్రతికూలతలు, పంట ఉత్పత్తికి సంబంధించి అందుతున్న మిశ్రమ ఫలితాలు, ఎగుమతులు తగ్గడం, పారిశ్రామిక రంగం ఎదుర్కొంటున్న ప్రతికూలతలు తమ తాజా అంచనాలకు కారణంగా తెలిపింది.

తాజా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)సహా పలు దేశీయ, అంతర్జాతీయ బ్యాంకింగ్, ఆర్థిక, వాణిజ్య దిగ్గజ సంస్థలు 2022–23 భారత్‌ తొలి వృద్ధి అంచనాలకు కోత పెడుతున్న సంగతి తెలిసిందే. 6.5 శాతం నుంచి 7.3 శాతం శ్రేణిలో వృద్ధి నమోదవుతుందన్నది ఆయా అంచనాల సారాంశం.  

2022–23 తుది ఆరు నెలల్లో వృద్ధి 6.5 శాతం: ఇక్రా 
కాగా, ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల్లో (అక్టోబర్‌–మార్చి) భారత్‌ వృద్ధి 6.5 శాతానికి పరిమితం అవుతుందని మరో రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనావేసింది. అయితే సెప్టెంబర్‌లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) విధాన పరపతి కమిటీ అంచనా 6.3 శాతంకన్నా ఇది అధికం కావ­డం గమనార్హం.  గత ఆర్థిక సంవత్సరం 
ఇదే కాలంలో వృద్ధి రేటు 12.7 శాతం కావడం గమనార్హం.

చదవండి: ఊహించని షాక్‌.. ఒకప్పుడు ఈ కారుకి ఫుల్‌ డిమాండ్‌, ఇప్పుడేమో ఒక్కరూ కొనట్లేదు!

మరిన్ని వార్తలు