జూలైలో రికార్డు స్థాయిలో పెరిగిన దేశ ఎగుమతులు

2 Aug, 2021 19:54 IST|Sakshi

న్యూఢిల్లీ: గత నెల జూలైలో భారత్ రికార్డు స్థాయిలో 35.2 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది. ఇది కీలక పాశ్చాత్య మార్కెట్లలో వేగవంతమైన ఆర్థిక రికవరీకి సంకేతం. దీంతో భారతీయ ఉత్పత్తులకు డిమాండ్ పెరగడానికి దారితీసింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రాథమిక డేటాలో మర్కండైజింగ్ దిగుమతులు కూడా $46.4 బిలియన్ల వరకు పెరిగాయి. ఇది చరిత్రలో రెండవ అత్యధికం. ఇక వాణిజ్య లోటు $11.2 బిలియన్లకు పెరిగింది. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బెల్జియం దేశాల ఎగుమతుల విలువ భారీగా పెరగగా, మలేషియా, ఇరాన్, టాంజానియాల ఎగుమతులు అత్యధికంగా క్షీణించాయి. 

అదేవిధంగా యుఎఇ, ఇరాక్, స్విట్జర్లాండ్ దేశాల దిగుమతులలో విలువ భారీగా పెరిగితే.. ఫ్రాన్స్, జర్మనీ, కజకస్తాన్ దిగుమతులు క్షీణించాయి. జూలైలో పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులు, రత్నాలు, ఆభరణాలను ఎక్కువగా ఎగుమతి జరిగాయి. ఇక అగ్ర దిగుమతి వస్తువులలో ముడి చమురు, బంగారం, విలువైన రాళ్ళు, వంట నూనెలు ఉన్నాయి. జూలై 2021లో భారతదేశం మర్కండైజింగ్ ఎగుమతుల విలువ 35.17 బిలియన్ డాలర్లు, గత ఏడాది జూలై కంటే ఈ ఏడాది జూలై నెలలో ఎగుమతుల విలువ 34% పెరిగాయి. 'ఆత్మనిర్భర్ భారత్ ప్రధాని నరేంద్ర మోడీ గారి దార్శనికత ఎగుమతులకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది' అని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. 

ప్రభుత్వం ఆర్థిక సంవత్సరానికి 500 బిలియన్ డాలర్లు, రాబోయే ఐదేళ్లలో 1 ట్రిలియన్ డాలర్ల మర్కండైజింగ్ ఎగుమతుల లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించింది. "కాబట్టి, రాబోయే ఆరు సంవత్సరాలలో సేవల ఎగుమతులు $500 బిలియన్లు, మర్కండైజింగ్ ఎగుమతులు $1 ట్రిలియన్లు ఉంటాయి. వార్షిక $1.5 ట్రిలియన్ల మొత్తం ఎగుమతులతో ప్రపంచ వాణిజ్యంలో భారతదేశం గణనీయమైన వాటాను కలిగి ఉంటుంది" అని వాణిజ్య కార్యదర్శి బి.వి.ఆర్. సుబ్రమణియన్ గత నెలలో తెలిపారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) గత వారం 2021 ప్రపంచ వృద్ధి అంచనాలో ఎటువంటి మార్పులు చేయకుండా 6% శాతం వద్దే ఉంచింది. ఇక మనదేశ వృద్ది అంచనాను ఐఎంఎఫ్ ఏప్రిల్ లో అంచనా వేసిన 12.5% నుంచి 9.5% తగ్గించింది. 

మరిన్ని వార్తలు