భారత్‌కు పొంచి ఉన్న ముప్పు..! ఎకానమీపై తీవ్ర ప్రభావం..!

19 Apr, 2022 08:29 IST|Sakshi

అంతర్జాతీయ సవాళ్లు పొంచి ఉన్నాయి 

రిజర్వ్‌బ్యాంక్‌ బులెటిన్‌లో ఆర్టికల్‌ 

న్యూఢిల్లీ: భారీ స్థాయిలో ఎగుమతులు, విస్తృతంగా నిర్వహిస్తున్న టీకాల ప్రక్రియ, సవాళ్లను దీటుగా అధిగమిస్తున్న ఆర్థిక రంగం ఊతంతో దేశ ఎకానమీ పటిష్టమైన స్థితిలో ఉంది. అయితే, అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ పరిణామాలపరమైన సవాళ్లు మాత్రం పొంచే ఉన్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఏప్రిల్‌ 2022 బులెటిన్‌లోని ఒక వార్తాకథనంలో ఈ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

వివిధ రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి పుంజుకోవడంతో కరోనా వైరస్‌ మూడో వేవ్‌ను అధిగమించి, సంవత్‌ 2079లోకి దేశం అడుగుపెడుతోందని కథనం పేర్కొంది. రాబోయే రోజుల్లో నిలకడగా వృద్ధిని సాధించాలంటే ప్రైవేట్‌ పెట్టుబడులు ఊపందుకోవడం చాలా కీలకమని వివరించింది. భౌగోళికరాజకీయ రిస్కులు వేగంగా పెరుగుతున్నాయని, సరఫరా వ్యవస్థలపై ఒత్తిడి నెలకొందని .. ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్తులో అంతర్జాతీయంగా పరిస్థితులు అంత ఆశావహంగా కనిపించడం లేదని ఆర్టికల్‌ వివరించింది. ఇలాంటి అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల ప్రభావాలకు భారత ఎకానమీ అతీతం కాదని తెలిపింది.

‘భారత్‌పై కూడా ఈ పరిణామాల ప్రభావం ఉంటోంది. యుద్ధం (రష్యా–ఉక్రెయిన్‌ మధ్య), ప్రతీకార ఆంక్షలు మొదలైన వాటి పర్యవసానాలు ఇప్పటికే ద్రవ్యోల్బణం తదితర రూపాల్లో కనిపిస్తున్నాయి. అయితే, దేశీయంగా కొన్ని సానుకూల అంశాలు మాత్రం కాస్త ఉపశమనంగా ఉంటున్నాయి‘ అని కథనం వివరించింది.  సరఫరా తగ్గిపోవడం, కమోడిటీల ధరలు.. ముఖ్యంగా ఆహారం, ఇంధనాల రేట్లు ఎగియడం తో ద్రవ్యోల్బణం పెరిగే రిస్కులు ఇప్పటికే కనిపిస్తు న్నాయని వివరించింది. అయితే, ఇందులో పొం దుపర్చిన అభిప్రాయాలన్నీ బులెటిన్‌ రూపకర్తలవేనని, ఇవన్నీ కచ్చితంగా రిజర్వ్‌ బ్యాంక్‌ అభిప్రాయాలుగా భావించడానికి లేదని ఆర్‌బీఐ పేర్కొంది. 

ఫలితాలిస్తున్న ఆర్‌బీఐ చర్యలు .. 
ద్రవ్య పరపతి విధానాల ప్రయోజనాలను బ్యాంకులు సత్వరం వినియోగదారులకు బదలాయించే విషయంలో ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యలు.. ఫలితాలిస్తున్నాయని బులెటిన్‌ తెలిపింది. 2019 అక్టోబర్‌లో ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ ఆధారిత రుణ రేటు (ఈబీఎల్‌ఆర్‌)తో ఈ ప్రక్రియ మరింత వేగం పుంజుకుందని, రాబోయే రోజుల్లో ఇది ఇంకా మెరుగుపడగలదని పేర్కొంది. అంతర్గత బెంచ్‌మార్క్‌ రుణ రేట్ల వల్ల బేస్‌ రేటు/ఎంసీఎల్‌ఆర్‌ మొదలైన వాటి లెక్కింపు విషయంలో పక్షపాత ధోరణులు ఉండేవని, ఫలితంగా పరపతి విధాన ప్రయోజనాల బదలాయింపు సరిగ్గా జరిగేది కాదని బులెటిన్‌ వివరించింది.    

చదవండి: నోట్ల రద్దుతో అలా..భారత్‌పై ప్రపంచబ్యాంకు కీలక వ్యాఖ్యలు..!

>
మరిన్ని వార్తలు