సాగుకు ‘టెక్‌’ సాయం..!

20 Aug, 2021 02:58 IST|Sakshi

టెక్నాలజీతో అధిక దిగుబడులు

రైతుకు పెరుగుతున్న రాబడులు

వచ్చే 20 ఏళ్లలో గణనీయ మార్పులు

బెంగళూరు: దేశీయంగా వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వినియోగం వివిధ స్థాయిల్లో గణనీయంగా పెరుగుతోంది. దీనితో ఇటు దిగుబడులు, అటు రైతాంగానికి రాబడులు మెరుగుపడుతున్నాయి. సాంకేతికత వినియోగంతో వచ్చే రెండు దశాబ్దాల్లో వ్యవసాయంలో గణనీయంగా మార్పులు రాగలవని, సాగు రంగం ముఖచిత్రం మారిపోగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రైతులు నిత్యం ఎదుర్కొనే పలు సవాళ్ల పరిష్కారానికి అగ్రి–టెక్‌ సంస్థలు రూపొందిస్తున్న అనేకానేక స్మార్ట్‌ సొల్యూషన్స్‌ ఇందుకు దోహదపడనున్నాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డ్రోన్లు వంటి మెషీన్‌ లెర్నింగ్‌ సొల్యూషన్‌లు, కచ్చితమైన వ్యవసాయ టెక్నిక్‌లు .. నాట్లు మొదలుకుని పంట రక్షణ, సాగు, కోతల దాకా అన్ని దశల్లోనూ రైతాంగానికి ప్రస్తుతం ఉపయోగపడుతున్నాయి.

వాతావరణాన్ని అంచనా వేయడానికి జీఐఎస్‌ మ్యాప్‌లు, శాటిలైట్‌ డేటాను ఉపయోగించడం, క్రిమిసంహారకాలను జల్లేందుకు కొత్త విధానాలు పాటించడం మొదలైనవి అమల్లోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రి–టెక్‌ స్టార్టప్‌ సంస్థలకు పుష్కలంగా పెట్టుబడులు కూడా అందుతున్నాయి. అమెరికాకు చెందిన ఫుడ్‌టెక్, అగ్రిటెక్‌ వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌ అయిన అగ్‌ఫండర్‌ నివేదిక ప్రకారం 2020లో దేశీ అగ్రి ఫుడ్‌ స్టార్టప్‌లలోకి 1.1 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చాయి. కన్సల్టెన్సీ సంస్థ బెయిన్‌ అండ్‌ కో అంచనా ప్రకారం 2025 నాటికి అగ్రి–లాజిస్టిక్స్, ఉత్పత్తి కొనుగోళ్ళు, ఎరువులు మొదలైన వాటి వినియోగం విలువ దాదాపు 30–35 బిలియన్‌ డాలర్లకు చేరవచ్చని అంచనా.

అర్ధ శతాబ్ద ఫలితాలు.. రెండున్నర దశాబ్దాల్లో
జినోమిక్స్‌ సహాయంతో ఇక్రిశాట్‌ (ఇంటర్నేషనల్‌ క్రాప్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సెమీ అరిడ్‌ ట్రాపిక్స్‌), ఇతర పరిశోధన సంస్థలతో కలిసి .. కరువు, తెగుళ్లను సమర్థంగా ఎదుర్కొనే వినూత్న శనగల వెరైటీలను రూపొందించింది. ప్రయోగాత్మక పరీక్షల్లో ఇవి సాధారణ స్థాయి కన్నా 15–28 శాతం అధిక దిగుబడులు అందించాయి. ఇలాంటి టెక్నాలజీల ఊతంతో వ్యవసాయ రంగంలో గత అర్ధశతాబ్దం పైగా కాలంలో వచ్చిన అభివృద్ధిని .. రాబోయే 25 ఏళ్లలోనే సాధించే అవకాశాలు ఉన్నాయని ఫెడరేషన్‌ ఆఫ్‌ సీడ్‌ ఇండస్ట్రీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐఐ) డైరెక్టర్‌ జనరల్‌ రామ్‌ కౌండిన్య తెలిపారు. సాంకేతికత అనేది రైతుల జీవితాలను సులభతరంగాను, సాగును లాభదాయకంగాను మార్చగలదని, ఆహార ఉత్పత్తిని పెంచగలదని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు, జన్యు మార్పిడి (జీఎం) పంటలతో వంట నూనెల దిగుమతులను గణనీయంగా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉందని సౌత్‌ ఏషియా బయోటెక్నాలజీ సెంటర్‌ వర్గాలు తెలిపాయి. భారత్‌లో ఏటా 2.2–2.3 కోట్ల టన్నుల వంట నూనెల వినియోగం ఉంటోందని, ఇందులో 1.5 కోట్ల టన్నులను దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని పేర్కొన్నాయి. అదే బయోటెక్నాలజీ తోడ్పాటుతో దేశీయంగా సోయాబీన్, పొద్దుతిరుగుడు పువ్వు, ఆవ గింజల దిగుబడులను పెంచుకోగలిగితే దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి తగ్గుతుందని వివరించాయి. దిగుమతయ్యే నూనెల్లో సింహభాగం జీఎం పంటల ద్వారా ఉత్పత్తి చేసినవే ఉంటున్నాయని, అయితే దేశీయంగా మాత్రం ఇలాంటి పంటలకు అంతగా ప్రోత్సాహం ఉండటం లేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. టెక్నాలజీ వినియోగంపై వ్యవసాయ రంగ నిపుణులు ఆశావహంగా ఉన్నప్పటికీ .. విధానపరమైన, నియంత్రణపరమైన అంశాలతో అవాంతరాలు ఎదురుకావచ్చని, వీటిని అధిగమిస్తే సాగు మరింత లాభసాటిగా మారగలదని అభిప్రాయపడ్డారు.

>
మరిన్ని వార్తలు