సింగర్‌ కార్తీక్‌ తొలి అడుగు.. సౌత్‌ ఇండియాలోనే ఫస్ట్‌ మెటావర్స్‌ కాన్సెర్ట్‌

6 Apr, 2022 10:44 IST|Sakshi

నాకొక గర్ల్‌ఫ్రెండ్‌ కావాలెగా.... అంటూ యువతరాన్ని ఉర్రూతలూగించిన సింగర్‌ కార్తీక్‌ మ్యూజిక్‌ కాన్సెర్ట్‌లలో కొత్త ఒరవడికి తెర లేపారు. దేశంలోనే తొలిసారిగా మెటావర్స్‌ కాన్సెర్ట్‌ నిర్వహించేందుకు రెడీ అయ్యాడు. అంతేకాదు ఈ కాన్సెర్ట్‌లో ఆలపించిన గీతాలను నాన్ ఫంజిబుల్‌ టోకెన్లుగా (ఎన్‌ఎఫ్‌టీ) మార్చి తన అభిమానులకు అందివ్వనున్నాడు.

ఏప్రిల్‌ 14న
సింగర్‌ కార్తీక్‌ నిర్వహించే మెటావర్స్‌ కాన్సెర్ట్‌ 2022 ఏప్రిల్‌ 14న జరగనుంది. ఈ కాన్సెర్ట్‌లో పాల్గొనాలంటే ప్రత్యేకంటా టిక్కెట్టు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో టిక్కెట్టు ధర రూ. 29,000లుగా నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో క్రిప్టో చెల్లింపులతో పాటు డెబిట్‌, క్రెడిట్‌, యూపీఏ పేమెంట్స్‌ ద్వారా ఈ టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. బ్లాక్‌చైయిన్‌ టెక్నాలజీపై పని చేస్తున్న జూపిటర్‌మెటా సం‍స్థ ఈ కాన్సెర్ట్‌కి సంబంధించి డిజిటల్‌ వర్క్స్‌ అన్నింటీని పర్యవేక్షిస్తోంది.

45 నిమిషాలు
మెటావర్స్‌ ఫ్లాట్‌ఫామ్‌పై దేశంలోనే తొలిసారిగా జరగబోతున్న ఈ కాన్సెర్ట్‌లో సింగర్‌ కార్తీక్‌ తాను స్వయంగా బాణీకట్టి ఆలపించిన గీతాలను పాడబోతున్నారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ కాన్సెర్ట్‌ కొనసాగనుంది. ఈ కాన్సెర్ట్‌లో పాడిన గీతాలలో రెండు పాటలను వీక్షకులకు ఎన్‌ఎఫ్‌టీలుగా అందివ్వనున్నారు. ఇక ఈ మెటావర్స్‌ కాన్సెర్ట్‌లో పాల్గొనే వారికి చేతులు ఊపడం, చేతులు ఎత్తడం, చప్పట్లు కొట్టడం వంటి అన్ని పనులు చేస్తూ ప్రత్యక్ష అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. 

మెటావర్స్‌ ?
ఫేస్‌బుక్‌ అధినేత జుకర్‌బర్గ్‌ మేథ నుంచి పుట్టిన మరో అద్భుతం మెటావర్స్‌. ఎక్కడెక్కడో ఉన్న జనాలు తమ ముందున్న ఫోన్ల ద్వారానే ఒకే చోట ఉన్నట్టుగా అనూభూతి కలిగించడమే సింపుల్‌గా మెటావర్స్‌గా పేర్కొనవచ్చు. అంటే మీరు మీ ఇంట్లో ఉంటూనే లైవ్‌ కాన్సెర్ట్‌లో ప్రత్యక్షంగా భాగం అయ్యే ఛాన్స్‌ మెటావర్స్‌ కలిగించనుంది.

అందరికీ సాధ్యమేనా?
మెటావర్స్‌, ఎన్‌ఎఫ్‌టీ కాన్సెప్టులు ప్రజల్లోకి బలంగా చొచ్చుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల రాధేశ్యామ్‌ ట్రైలర్‌ సైతం మెటావర్స్‌లో రిలీజ్‌ చేశారు. అంతకు ముందు సింగర్‌ దలేర్‌ మెహందీ 2022 జనవరి 26న ఇండియాలోనే ఫస్ట్‌మెటావర్స్‌ కాన్సెర్ట్‌ నిర్వహించారు. అయితే మెటావర్స్‌ ఇంకా ప్రారంభ దశలోనే ఉ‍ంది. మెటావర్స్‌ అనుభూతి పొందేందుకు అవసరమైన స్పీడ్‌ ఇంటర్నెట్‌, వివిధ రకాలైన సెన్సార్లు కలిగిన ఫోన్లు, వీఆర్‌ హెడ్‌ సెట్‌ తదితర విషయాలు మరింత మెరుగు కావాల్సి ఉంది.

చదవండి: డేటాకు ‘మెటావర్స్‌’ దన్ను..

మరిన్ని వార్తలు