విదేశీ ఫండ్స్‌పై భారీగా తగ్గిన పెట్టుబడుల ప్రవాహం

17 Aug, 2021 14:11 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీ మార్కెట్‌పై దృష్టిపెట్టే ఆఫ్‌షోర్‌ విభాగంలోని ఫండ్స్, ఎక్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌(ఈటీఎఫ్‌లు) నుంచి మరోసారి పెట్టుబడులు వెనక్కి మళ్లాయి. ఈ కేలండర్‌ ఏడాది(2021) రెండో త్రైమాసికం(ఏప్రిల్‌– జూన్‌)లో నికరంగా 1.55 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ. 11,500 కోట్లు) ఔట్‌ఫ్లో నమోదైంది. వెరసి వరుసగా 13వ త్రైమాసికంలోనూ ఈ ఫండ్స్‌ నుంచి విత్‌డ్రాయల్స్‌ చోటుచేసుకున్నట్లు మార్నింగ్‌స్టార్‌ తాజా నివేదిక పేర్కొంది. కాగా.. 2021 క్యూ1(జనవరి–మార్చి)లో నమోదైన 37.6 కోట్ల డాలర్ల(రూ. 2,790 కోట్లు)తో పోలిస్తే పెట్టుబడులు భారీ స్థాయిలో వెనక్కి మళ్లడం గమనించదగ్గ అంశం! 2020 అక్టోబర్‌–డిసెంబర్‌లోనూ 98.6 కోట్ల డాలర్ల పెట్టుబడులు తరలిపోయాయి. 

విదేశీ ఇన్వెస్టర్ల దృష్టి 

దేశీయంగా ఈక్విటీ మార్కెట్లలో ప్రధానంగా ఆఫ్‌షోర్‌ ఫండ్స్, ఈటీఎఫ్‌ల ద్వారా విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే జూన్‌ క్వార్టర్‌లో ఆఫ్‌షోర్‌ ఫండ్‌ విభాగంలో 1.7 బిలియన్‌ డాలర్ల అమ్మకాలు నమోదయ్యాయి. మార్చి త్రైమాసికంలో ఇవి 1.1 బిలియన్‌ డాలర్లు మాత్రమే. కాగా.. 37 నెలల ఔట్‌ఫ్లో తదుపరి మార్చిలో 3.32 కోట్ల డాలర్ల పెట్టుబడులు రావడం గమనార్హం. అయితే కోవిడ్‌–19 సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ఈ ట్రెండ్‌కు వెంటనే బ్రేక్‌ పడింది. ఇక మరోవైపు సానుకూల పరిస్థితులను కొనసాగిస్తూ వరుసగా మూడో క్వార్టర్‌లోనూ ఆఫ్‌షోర్‌ ఈటీఎఫ్‌లకు నికరంగా పెట్టుబడులు తరలివచ్చాయి. జూన్‌ త్రైమాసికంలో 15.3 కోట్ల డాలర్ల ఇన్‌ఫ్లో నమోదైంది. మార్చి త్రైమాసికంలో నమోదైన 76.7 కోట్ల డాలర్లతో పోలిస్తే మాత్రం భారీగా తగ్గాయి. 2020 అక్టోబర్‌–డిసెంబర్‌లోనూ 88.2 కోట్ల డాలర్ల పెట్టుబడులు వచ్చిన సంగతి తెలిసిందే.  

దీర్ఘకాలానికి..: సాధారణంగా ఆఫ్‌షోర్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు దీర్ఘకాలానికి సంబంధించినవికాగా.. ఆఫ్‌షోర్‌ ఈటీఎఫ్‌ల ద్వారా విదేశీ ఇన్వెస్టర్లు స్వల్పకాలిక ధృక్పథంతో ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. 2018 ఫిబ్రవరి మొదలు ఈ రెండు ఫండ్స్‌ నుంచి నిరవధికంగా పెట్టుబడులు తరలిపోతూ వస్తున్నాయి. ఈ ట్రెండ్‌ 2020 మార్చికల్లా గరిష్టానికి చేరింది. దాదాపు 5 బిలియన్‌ డాలర్ల అమ్మకాలు నమోదయ్యాయి. వెరసి ఒక త్రైమాసికంలో అత్యధిక స్థాయి ఔట్‌ఫ్లోస్‌గా రికార్డు నమోదైంది. ఈ బాటలో 2021 జూన్‌కల్లా ఆఫ్‌షోర్‌ ఫండ్స్‌ నుంచి 20.8 బిలియన్‌ డాలర్లు, ఆఫ్‌షోర్‌ ఈటీఎఫ్‌ల నుంచి 2.6 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వెనక్కి మళ్లాయి. జూన్‌ క్వార్టర్‌లో పెట్టుబడులు తరిగిపోయినప్పటికీ ఈ ఫండ్స్‌ ఆస్తుల విలువ మార్చి త్రైమాసికంతో పోలిస్తే 4 శాతం బలపడి 46.3 బిలియన్‌ డాలర్లకు చేరడం విశేషం!

చదవండి : రష్యాలో ప్రాజెక్టులు,15 బిలియన్‌ డాలర్లు దాటిన భారత్‌ పెట్టుబడులు

మరిన్ని వార్తలు