సరికొత్త జీవితకాల రికార్డు స్థాయికి భారత ఫారెక్స్‌ నిల్వలు

10 Jul, 2021 15:34 IST|Sakshi

610 బిలియన్‌ డాలర్లకు అప్‌  

ముంబై: భారత్‌ విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్‌) నిల్వలు సరికొత్త జీవితకాల రికార్డు స్థాయికి చేరాయి. జూలై 2వ తేదీతో ముగిసిన వారంలో అంతక్రితం వారంతో పోల్చితే 1.013 బిలియన్‌ డాలర్లు ఎగసి 610.012 బిలియన్‌ డాలర్లకు (దాదాపు రూ.45 లక్షల కోట్లు)  చేరినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి.  2020 జూన్‌ 5తో ముగిసిన వారంలో మొట్టమొదటిసారి భారత్‌ ఫారెక్స్‌ నిల్వలు అర ట్రిలియన్‌ స్థాయిని అధిగమించి 501.70 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అటు తర్వాత కొంచెం ఒడిదుడుకులు ఉన్నప్పటికీ,  నిల్వలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఏడాది తిరిగే సరికి నిల్వలు మరో 100 బిలియన్‌ డాలర్లు పెరిగాయి.

జూన్‌ 4వతేదీతో ముగిసిన వారంలో మొదటిసారి 600 బిలియన్‌ డాలర్లను దాటి 605.008 డాలర్ల స్థాయికి చేరాయి. అటు తర్వాత కొంత తగ్గినా... తాజా సమీక్షా వారంలో రికార్డుల దూకుడు కొనసాగింది. ప్రస్తుత నిల్వలు భారత్‌ 20 నెలల దిగుమతులకు  దాదాపు సరిపోతాయన్నది అంచనా. అంతర్జాతీయంగా భారత్‌ ఎకానమీకి వచ్చే కష్టనష్టాలను, ఒడిదుడుకులను ఎదుర్కొనడానికి ప్రస్తుత స్థాయి నిల్వలు దోహదపడతాయని ఇటీవలి  ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షలో ఆర్‌బీఐ  విశ్లేషించిన సంగతి తెలిసిందే. గణాంకాలను విభాగాల వారీగా పరిశీలిస్తే.. 

  • మొత్తం నిల్వల్లో డాలర్ల రూపంలో చూస్తే ప్రధానమైన ఫారిన్‌ కరెన్సీ అసెట్స్‌ (ఎఫ్‌సీఏ) విలువ తాజా సమీక్షా వారంలో 748 మిలియన్‌ డాలర్లు పెరిగి 566.988 బిలియన్‌ డాలర్లకు చేరింది.  
  • పసిడి నిల్వలు 76 మిలియన్‌ డాలర్లు ఎగసి 36.372 బిలియన్‌ డాలర్లకు చేరాయి.  
  • అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) వద్ద స్పెషల్‌ డ్రాయింగ్స్‌ రైట్స్‌ విలువ 49 మిలియన్‌ డాలర్లు పెరిగి 1.548 డాలర్లకు చేరింది. 
  • ఐఎంఎఫ్‌ వద్ద రిజర్వ్స్‌ 139 మిలియన్‌ డాలర్లు పెరిగి 5.105 బిలియన్‌ డాలర్లకు చేరాయి.  

మరిన్ని వార్తలు