గేమింగ్‌లో భారీ ఉద్యోగాలు

19 Nov, 2022 06:02 IST|Sakshi

2022–23లో కొత్తగా లక్ష మందికి ఉపాధి

టీమ్‌లీజ్‌ డిజిటల్‌ అంచనా

ముంబై: గేమింగ్‌ పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా లక్ష మందికి (ప్రత్యక్షంగా, పరోక్షంగా) ఉపాధి కల్పించొచ్చని టీమ్‌లీజ్‌ డిజిటల్‌ తెలిపింది. ప్రోగ్రామింగ్, టెస్టింగ్, యానిమేషన్, డిజైన్‌ తదితర విభాగాల్లో ఈ ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది. 20–30 శాతం మేర ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిని సాధిస్తుందని అంచనా వేసింది. ‘గేమింగ్‌–రేపటి బ్లాక్‌ బస్టర్‌’పేరుతో టీమ్‌లీజ్‌ డిజిటల్‌ గురువారం ఒక నివేదికను విడుదల చేసింది.

ఇందులోని వివరాల ప్రకారం.. గేమింగ్‌ పరిశ్రమ ప్రస్తుతం ప్రత్యక్షంగా 50వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇందులో 30 శాతం ఉద్యోగాలు ప్రోగ్రామర్లు, డెవలపర్ల రూపంలోనే ఉన్నాయి. వచ్చే ఏడాది కాలంలో ఈ రంగంలో గేమ్‌ డెవలపర్లు, యూనిటీ డెవలపర్లు, గేమ్స్‌ టెస్ట్‌ ఇంజనీర్లు, క్యూఏ హెడ్‌లు, యానిమేటర్లు, మోషన్‌ గ్రాఫిక్‌ డిజైనర్లు, వర్చువల్‌ రియాలిటీ డిజైనర్లు, వీఎఫ్‌ఎక్స్, కాన్సెప్ట్‌ ఆర్టిస్ట్‌లకు డిమాండ్‌ ఉంటుంది.  

అధిక వేతనం..
ఈ రంగంలో అత్యధికంగా గేమ్‌ ప్రొడ్యూసర్లకు రూ.10 లక్షల వార్షిక వేతనం ఉంటే.. గేమ్‌ డిజైనర్లకు 6.5 లక్షలు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు రూ.5.5 లక్షలు, గేమ్‌ డెవలపర్లు రూ.5.25 లక్షలు, క్వాలిటీ అష్యూరెన్స్‌ టెస్టర్లకు రూ.5.11 లక్షల చొప్పున వార్షిక ప్యాకేజీలున్నాయి. ‘‘గేమింగ్‌ పరిశ్రమ తదుపరి ఉదయించే రంగం. యూజర్ల సంఖ్య పెరుగుతుండడంతో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు వెల్లువలా రానున్నాయి.

తరచూ నియంత్రణపరమైన నిబంధనల మార్పు రూపంలో అడ్డంకులు ఎదురవుతున్నప్పటికీ.. గేమింగ్‌ పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా లక్ష మందికి ఉపాధినిస్తుంది. 2026 నాటికి 2.5 రెట్లు వృద్ధి చెందుతుంది’’అని టీమ్‌లీజ్‌ డిజిటల్‌ సీఈవో సునీల్‌ చెమ్మన్‌కోటిల్‌ తెలిపారు. 2026 నాటికి గేమింగ్‌ పరిశ్రమ రూ.38,097 కోట్లకు చేరుతుందని టీమ్‌లీజ్‌ అంచనా వేసింది. ఆదాయం పరంగా భారత్‌ గేమింగ్‌ పరిశ్రమ అంతర్జాతీయంగా ఆరో స్థానంలో ఉంది. అంతర్జాతీయంగా ఈ విపణి విలువ రూ.17,24,800 కోట్లుగా ఉంది. 

మరిన్ని వార్తలు