ఆసియాలో రెండో అతిపెద్ద శ్రీమంతునిగా ప్రముఖ భారతీయుడు

21 May, 2021 22:58 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ చరిత్ర సృష్టించారు. ఆసియా శ్రీమంతుల జాబితాలో రెండో స్థానానికి దూసుకుపోయారు. అదానీ గ్రూపుకు చెందిన వివిధ రంగాల షేర్లు ఈ ఏడాది(2021)లో అమాంతం పెరగడంతో అతని సంపదన కూడా అదే రీతిన పెరిగింది. ఫలితంగా ఆసియాలోనే రెండో ధనవంతుడిగా తన పేరుని నమోదు చేసుకున్నాడు. ఇటీవల ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్‌-20లో చోటు దక్కించుకున్న అదానీ ప్రస్తుతం ఈ ఘనతను సాధించాడు. కాగా రిలయన్స్ సంస్థ అధినేత‌ ముఖేష్‌‌‌ అంబానీ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.

తాజాగా బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించిన ప్రకారం.. ఇప్పటిదాకా ఆసియాలో రెండో స్థానంలో కొనసాగిన చైనా పారిశ్రామికవేత్త జోంగ్‌ షాన్షాన్‌ ఆస్తి 6,360 కోట్ల డాలర్లకు పడిపోయింది. అదానీ గ్రూప్‌ షేర్ల ర్యాలీతో గురువారం నాటికి గౌతమ్‌ అదానీ వ్యక్తిగత సంపద 6,650 కోట్ల డాలర్లకు పెరిగింది. దీంతో షాన్షాన్‌ను వెనక్కి నెట్టి గౌతమ్ అదానీ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఏడాదిలో అదానీ ఆస్తి 3,270 కోట్ల డాలర్లు పెరగగా అదే క్రమంలో షాన్షాన్‌ ఆస్తి 1,460 కోట్ల డాలర్లు క్షీణించింది. ప్రస్తుతం ప్రపంచ శ్రీమంతుల జాబితాలో అంబానీ 13వ స్థానంలో వుండగా, అదాని 14వ స్థానంలో ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ ప్రకటించింది.

చదవండి: 18 మిలియన్ల పోస్టులను తొలగించిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్

మరిన్ని వార్తలు