India GDP: వృద్ధి జోరులో మనమే టాప్‌..! 

1 Dec, 2021 04:48 IST|Sakshi

జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఎకానమీ పురోగతి 8.4 శాతం

అంచనాలకు మించి ఫలితాలు

విలువలో రూ.35.73 లక్షల కోట్లు

2019–20 ఇదే త్రైమాసికంతో పోల్చితే 0.33 శాతం అధికం

మొదటి ఆరు నెలల్లో వృద్ధి రేటు 13.7 శాతం  

న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) రెండవ త్రైమాసికంలో అంచనాలకు మించి 8.4 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. తద్వారా ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ హోదాను భారత్‌ నిలబెట్టుకుంది. మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు 20.1 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. వెరసి రెండు త్రైమాసికాల్లో (ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో) వృద్ధి రేటు 13.7 శాతమని మంగళవారం వెలువడిన గణాంకాలు వెల్లడించాయి.

ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో (ఏప్రిల్, మే) సెకండ్‌వేవ్‌ ప్రభావం లేకపోతే ఎకానమీ మరింత పురోగమించేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్యూ2లో 7.9 శాతం వృద్ధి రేటు నమోదవుతుందన్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అంచనాలకన్నా అధికంగా తాజా గణాంకాలు వెలువడ్డం గమనార్హం. 

వివిధ సంస్థలు, రేటింగ్‌ సంస్థల అంచనాలు సైతం 7.8 శాతం నుంచి 8.3 శాతం శ్రేణిలోనే ఉన్నాయి. మరోవైపు  రెండవ త్రైమాసికంలో ఈ స్థాయి గణాంకాల నమోదుకు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లో బేస్‌ ప్రధాన (బేస్‌ ఎఫెక్ట్‌) కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా సవాళ్లతో అప్పట్లో ఎకానమీ వృద్ధిలేకపోగా 7.4 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. ‘పోల్చుతున్న నెలలో’  అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో  ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్‌ ఎఫెక్ట్‌.

విలువల్లో ఇలా... 
తాజా సమీక్షా త్రైమాసికం జూలై–సెప్టెంబర్‌ మధ్య ఎకానమీ విలువ రూ.35.73 లక్షల కోట్లు. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ రూ.32.96 లక్షల కోట్లు. వెరసి ఎకానమీ వృద్ధి రేటు 8.4 శాతంగా నమోదయ్యింది. కోవిడ్‌–19 సవాళ్లు దేశంలో ప్రారంభంకాని 2019–20 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ఎకానమీ విలువతో పోల్చి చూస్తే, ఎకానమీ విలువ స్వల్పంగా 0.33 శాతం అధికంగా నమోదయ్యింది.

కాగా, ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్య ఎకానమీ విలువలు రూ.59.92 లక్షల కోట్ల నుంచి (2020–21 తొలి ఆరునెలల్లో) రూ.68.11 లక్షల కోట్లకు (13.7 శాతం వృద్ధి) పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో అసలు వృద్ధి లేకపోగా 15.9 శాతం క్షీణత నమోదయ్యింది.

కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. 
తాజా సమీక్షా నెల్లో ప్రభుత్వ వ్యయాల్లో 8.7% వృద్ధి నమోదవడం, తక్కువ వడ్డీరేట్ల వ్యవస్థ, పెరిగిన వినియోగం ఎకానమీ లో సానుకూలతను సృష్టించాయి.  
తగిన వర్షపాతంలో జీడీపీలో దాదాపు 15 శాతం వాటా ఉన్న వ్యవసాయ రంగం మంచి ఫలితాన్ని ఇచ్చింది. 4.5 శాతం వృద్ధి నమోదయ్యింది.  
దేశీయ డిమాండ్, ఎగుమతులు పెరగడంతో తయారీ రంగంలో 5.5 శాతం పురోగతి నమోదయ్యింది. మొత్తం జీడీపీలో పారిశ్రామిక రంగం వాటా దాదాపు 15 శాతం అయితే, అందులో తయారీ రంగం వాటానే దాదాపు 78 శాతం.  
నిర్మాణం, ట్రేడ్, హోటల్స్‌ రవాణా, ఫైనాన్షియల్‌ సేవల రంగాల్లో 7 నుంచి 8 శాతం వృద్ధి రేట్లు నమోదయ్యాయి.  
ప్రభుత్వ సేవలు, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్‌ రంగాల్లో 17.4 శాతం వృద్ధి నమోదుకావడం సానుకూల పరిణామం.  
ఇక ఉత్పత్తి స్థాయి వరకూ లెక్కించే జీవీఏ (గ్రాస్‌ వ్యాల్యూ యాడెడ్‌)లో వృద్ధి రేటు జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో 8.5 శాతంగా నమోదయ్యింది.  
కాగా, జూలై–సెప్టెంబర్‌ మధ్య చైనా వృద్ధి రేటు 4.9 శాతం.

2021–22పై అంచనాలు ఇలా... 
గడచిన ఆర్థిక సంవత్సరం (2020–21) కరోనా సవాళ్లతో ఎకానమీ 7.3 శాతం క్షీణతను నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే 2021–22లో వృద్ధి రేటు 11 శాతంగా ఉంటుందని ఈ ఏడాది జనవరిలో విడుదలైన ఎకనమిక్‌ సర్వే పేర్కొంది. అయితే అటు తర్వాత ఏప్రిల్, మే నెలల్లో సెకండ్‌వేవ్‌ దేశాన్ని కుదిపివేసింది. ఈ నేపథ్యంలో ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 9.3 శాతం–9.6% శ్రేణిలో ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది.

క్యూ3లో 6.8%, క్యూ4లో 6.1% వృద్ధి నమోదవుతుందని ఆర్‌బీఐ ఇటీవలి పాలసీ సమీక్ష పేర్కొంది. అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం– స్టాండెర్డ్‌ అండ్‌ పూర్స్‌ (ఎస్‌అండ్‌పీ) మంగళవారం ఒక నివేదికను విడుదల చేస్తూ, 2021–22లో భారత్‌ ఎకానమీ 9.5 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంటుందని అంచనా వేసింది. 2022–23 ఏడాదిలో ఈ రేటు 7.8% ఉంటుందని విశ్లేషించింది.

రెండంకెల వృద్ధి దిశగా... 
భారత్‌ 2021–22 ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి దిశగా పయనిస్తోంది. డిమాండ్‌లో గణనీయ వృద్ధి, బ్యాంకింగ్‌ రంగం పురోగతి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. క్రితం త్రైమాసికాల్లో దాదాపు 6 శాతం వృద్ధి రేటు నమోదుకాగా, సెప్టెంబర్‌ వరకూ గడచిన త్రైమాసికాల్లో వృద్ధి రేటు 13.7 శాతం నమోదుకావడం హర్షణీయ పరిణామం. 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి రేట్లు వరుసగా 7 శాతం వరకూ ఉంటుందని భావిస్తున్నాం. కేంద్రం చేపడుతున్న రెండవ తరం ఆర్థిక సంస్కరణలు ఇందుకు దోహపడతాయని భావిస్తున్నాం. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, రుణ భారాల కట్టడికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. మూలధన వ్యయాల పెంపునకు కృషి జరుగుతుంది.  

– కేవీ సుబ్రమణియన్, ప్రధాన ఆర్థిక సలహాదారు  

మరిన్ని వార్తలు