ఎకానమీకి లోబేస్‌ భరోసా.. జీడీపీ జూమ్‌!

1 Sep, 2021 03:43 IST|Sakshi

ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో 20.1% వృద్ధి

విలువ రూ.32,38,020 కోట్లు

2020 ఇదే కాలంలో ఈ విలువ రూ.26,95,421 కోట్లు

వెరసి శాతాల్లో భారీ పెరుగుదల

2019–20 తొలి క్వార్టర్‌తో పోల్చితే ఇంకా వెనుకే...

న్యూఢిల్లీ: అంచనాలకు అనుగుణంగానే భారత్‌ ఆర్థిక వ్యవస్థ 2021–22 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) 20.1 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంది. ఇందుకు లోబేస్‌ ప్రధాన కారణమైంది. అయితే ఇదే కాలంలో దేశం మహమ్మారి సెకండ్‌వేవ్‌ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, ఎకానమీ తగిన సానుకూల ఆర్థిక ఫలితాన్ని సాధించడం కొంతలో కొంత ఊరట.  

లోబేస్‌ అంటే..?
‘పోల్చుతున్న నెలలో’  అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో  ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్‌ ఎఫెక్ట్‌.  ఇక్కడ బేస్‌ 2020 ఏప్రిల్‌–జూన్‌ కాలాన్ని తీసుకుంటే కరోనా కష్టాలతో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో అసలు వృద్ధిలేకపోగా (2019 ఇదే కాలంలో పోల్చి) 24.4 శాతం క్షీణతను ఎదుర్కొంది. అప్పటి లోబేస్‌తో పోల్చితే జీడీపీ విలువ తాజా సమీక్షా కాలంలో 20.1 శాతం పెరిగిందన్నమాట.  

విలువలు ఇలా...
2020–21 ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో భారత్‌ స్థూల దేశీయోత్పత్తి విలువ రూ.26,95,421 కోట్లు (2019–20 తొలి క్వార్టర్‌తో పోల్చితే 24.4 శాతం డౌన్‌). జాతీయ గణాంకాల కార్యాలయం మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం తాజా సమీక్షా కాలంలో(2021–22 ఏప్రిల్‌–జూన్‌) ఈ విలువ రూ.32,38,020 కోట్లకు చేరింది. వెరసి వృద్ధి రేటు 20.1 శాతంగా నమోదయ్యింది.

అయితే తాజా సమీక్షా నెల్లో విలువ కరోనా ముందు కాలంలో పోల్చితే ఇంకా వెనుకబడి ఉండడం గమనార్హం. 2019–20 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎకానమీ పరిమాణం రూ.35,66,708 కోట్లు. అప్పటితో పోల్చితే, ఎకానమీ ఇంకా రూ. 3,28,688 కోట్లు వెనుకబడి ఉండడం గమనార్హం. శాతాల్లో చెప్పాలంటే కోవిడ్‌–19 ముందస్తు కాలంతో పోల్చితే ఇంకా 9.2 శాతం ఎకానమీ వెనుకబడి ఉందన్నమాట.  

రంగాల వారీగా...
ఉత్పత్తి స్థాయి వరకూ పరిశీలనలోకి తీసుకునే గ్రాస్‌ వ్యాల్యూ యాడెడ్‌ (జీవీఏ) విలువ ప్రకారం తాజా సమీక్షా కాలంలో (ఏప్రిల్‌–జూన్‌) వివిధ రంగాల వృద్ధి తీరు ఇలా...
► తయారీ: ఈ రంగం ఉత్పత్తి 49.6% ఎగసింది. 2020–21 ఏప్రిల్‌–జూన్‌ మధ్య ఈ విభాగం 36 శాతం క్షీణించింది.  
► వ్యవసాయ రంగం: వృద్ధి 3.5% నుంచి 4.5%కి చేరింది.  
► నిర్మాణం: 49.5% క్షీణత నుంచి 68.3% వృద్ధికి మళ్లింది.  
► మైనింగ్‌: 18.6 శాతం వృద్ధి నమోదుచేసుకుంది. 2020–21 ఏప్రిల్‌–జూన్‌ మధ్య ఈ విభాగం 17.2 శాతం క్షీణించింది.  
► విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా ఇతర యుటిలిటీ సేవలు: ఈ విభాగంలో తాజా సమీక్షా కాలంలో 14.3 శాతం వృద్ధి నమోదుకాగా, 2020 ఇదే కాలంలో 9.9 శాతం క్షీణత నమోదయ్యింది.  
► వాణిజ్యం, హోటెల్, రవాణా, కమ్యూనికేషన్లు, సేవలు: 48.1 శాతం క్షీణత 34.3 శాతం వృద్ధిబాటకు వచ్చింది.  
► ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్‌ సేవలు: 2020 ఏప్రిల్‌–జూన్‌ మధ్య 5 శాతం క్షీణిస్తే, తాజా సమీక్షా కాలంలో 3.7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది.  
► పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, రక్షణ, ఇతర సేవల రంగాలు మైనస్‌ 10.2% నుంచి 5.8% వృద్ధి బాటలోకి వచ్చాయి.  

త్రైమాసికం పరంగా 16.9 శాతం పతనం
త్రైమాసికం పరంగా చూస్తే, ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య ఎకానమీ విలువ 38.96 లక్షల కోట్లు. తాజా సమీక్షా కాలంలో ఈ విలువ రూ.32.38 లక్షల కోట్లు. అంటే త్రైమాసికపరంగా చూసినా ఎకానమీ 16.9% డౌన్‌లో ఉందన్నమాట. దీనికి ప్రధానంగా ఏప్రిల్‌–మే నెలల్లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన  కోవిడ్‌–19 సెకండ్‌వేవ్‌  కారణం.  ఉత్పత్తి స్థాయి వరకూ పరిశీలనలోకి తీసుకునే గ్రాస్‌ వ్యాల్యూ యాడెడ్‌ (జీవీఏ) విలువలో చూస్తే క్యూ1లో  వృద్ధి రేటు (2020 ఇదే కాలంలో పోల్చి) 18.8% పురోగమించింది. అయితే 2020 జనవరి–మార్చి కాలంతో చూస్తే, విలువ 13.3% క్షీణించడం గమనార్హం.

2021–22పై అంచనాలు ఇలా...
కోవిడ్‌–19 మహమ్మారి సవాళ్ల నేపథ్యంలో గడచిన ఆర్థిక సంవత్సరం ఎకనామీ 7.3 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. అయితే లోబేస్‌కుతోడు ఎకానమీ ఊపందుకుని 2021–22లో వృద్ధి రేటు 17 శాతం వరకూ నమోదవుతుందన్న అంచనాల నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం సెకండ్‌వేవ్‌ సవాళ్లు ప్రారంభమయ్యాయి. దీనితో పలు ఆర్థిక, రేటింగ్, విశ్లేషణా సంస్థలు 2021–22పై తమ వృద్ధి అంచనాలను రెండంకెల లోపునకు కుదించేశాయి.

7.5 శాతం నుంచి 9.5 శాతం శ్రేణిలో వృద్ధి నమోదవుతుందన్న అంచనాలను తాజాగా వెలువరిస్తున్నాయి. ఆర్‌బీఐ, ఐఎంఎఫ్, ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ 9.5 శాతం అంచనావేస్తుండగా, మూడీస్‌ అంచనా 9.3 శాతంగా ఉంది. అయితే ప్రపంచబ్యాంక్‌ వృద్ధి రేటు అంచనా 8.3 శాతంగా ఉంది. ఫిచ్‌ రేటింగ్స్‌ మాత్రం 10 శాతం వృద్దిని అంచనావేస్తోంది. కాగా, 2021లో 9.6 శాతం, 2022లో 7 శాతం వృద్ధి నమోదవుతుందని మూడీస్‌ తాజా నివేదికలో అంచనా వేసింది.

కీలక రంగాలు విలువల్లో...
ఒక్క వ్యవసాయ రంగం మినహా అన్ని రంగాల విలువలూ కోవిడ్‌–19 ముందస్తు స్థాయికన్నా తక్కువగానే ఉండడం గమనార్హం. 2019 ఏప్రిల్‌–జూన్‌ మధ్య తయారీ రంగం ఉత్పత్తి విలువ 5.67 లక్షల కోట్లయితే, ఈ విలువ 2021 ఏప్రిల్‌–జూన్‌ మధ్య రూ.5.43 లక్షల కోట్లుగా ఉంది. సేవల రంగం విలువ మాత్రం కోవిడ్‌ ముందస్తు స్థాయి (రూ.6.64 లక్షల కోట్లు)కి ఇంకా చాలా దూరంలో ఉంది. సమీక్షా కాలంలో ఈ విలువ రూ.4.63 లక్షల కోట్లుగా ఉంది. వ్యవసాయ రంగం విలువ రూ.4.49 లక్షల కోట్ల నుంచి రూ.4.86 లక్షల కోట్లకు ఎగసింది. దేశ ఎకానమీలో పారిశ్రామిక, వ్యవసాయ రంగాల వాటా 15 శాతం చొప్పున ఉండగా, సేవల రంగం విలువ దాదాపు 60 శాతం వరకూ ఉంది.

వేగవంతమైన వృద్ధి హోదా
తాజా గణాంకాల ప్రకారం, ప్రపంచంలో వేగవంతమైన వృద్ధిని నమోదుచేసుకున్న దేశాల్లో మొదటి స్థానం హోదాను భారత్‌ దక్కించుకుంది. 2021 ఏప్రిల్‌–జూన్‌ మధ్య కాలంలో చైనా వృద్ధి రేటు 7.9 శాతం.  

భవిష్యత్‌ వృద్ధికి బాటలు
మొదటి త్రైమాసికంలో సానుకూల ఆర్థిక ఫలితాలు వచ్చాయి. ఆర్థిక సంవత్సరం రానున్న నెలల్లో ఎకానమీ మరింత మెరుగుపడుతుందన్న సంకేతాలను ఈ గణాంకాలు అందిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వృద్ధి అంచనాలను ఎగువముఖంగా సవరించే అవకాశం ఉంది.  
– రాజీవ్‌ కుమార్, నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌

ఆర్థిక మూలాలు పటిష్టం
భారత్‌ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న వ్యవస్థాగత సంస్కరణలు, చేస్తున్న భారీ మూలధన వ్యయాలు వృద్ధికి బాటలు వేస్తున్నాయి. ఎకానమీలో ‘వీ’ (ఠి) నమూనా వృద్ధి ధోరణి నమోదవుతుందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గుదల ధోరణి ఎకానమీకి కలిసివస్తుంది.  
– కేసీ సుబ్రమణ్యం, సీఈఏ

పునరుత్తేజం: పారిశ్రామిక రంగం
ఎకానమీ కోవిడ్‌–19 సవాళ్ల నుంచి కోలుకుని పునరుత్తేజం అవుతున్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని భారత్‌ పారిశ్రామిక రంగం పేర్కొంది. సెకండ్‌వేవ్‌ సవాళ్లు ఉన్నప్పటికీ, మొదటి త్రైమాసికంలో ఎకానమీ తగిన మంచి ఫలితాన్ని ఇచ్చిందని ఇండస్ట్రీ చాంబర్‌–సీఐఐ పేర్కొంది. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల కార్యక్రమాలు వృద్ధికి ఊతం ఇస్తున్నట్లు పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్‌ సంజయ్‌
అగర్వాల్‌ పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు