క్యూ2లో ఎకానమీ వృద్ధి 5.8 శాతం

29 Nov, 2022 13:07 IST|Sakshi

ఎస్‌బీఐ రిసెర్చ్‌ అంచనా ∙రేపు అధికారిక గణాంకాలు   

ముంబై: భారత్‌ ఎకానమీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (2022-23 జూలై,ఆగస్టు, సెప్టెంబర్‌) 5.8 శాతం వృద్ధి నమెదు చేసుకుంటుందని ఎస్‌బీఐ రిసెర్చ్‌ తన అధ్యయనంలో తెలిపింది. తయారీ, వినియోగ విభాగాల బలహీనత గణాంకాలపై ప్రతికూల ప్రభావం చూపనుందని పేర్కొంది.

నవంబర్‌ 30వ తేదీన క్యూ2 స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అధికారిక లెక్కలు వెలువడనున్న నేపథ్యంలో ఎస్‌బీఐ తాజా అంచనాలను వెలువరించింది. క్యూ2లో మార్కెట్‌ అంచనాలకన్నా (6.1 శాతం) ఇది 30 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) తక్కువగా ఉండడం గమనార్హం. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం అంచనాలను 6.8 శాతంగా ఎస్‌బీఐ అంచనా వేసింది. మార్కెట్‌ అంచనాల కన్నా 20 బేసిస్‌ పాయింట్లు తక్కువ. 41 ఇండికేటర్ల విశ్లేషణల ప్రాతిపదికన ఎస్‌బీఐ అంచనాలు వెలువడతాయి.

2022-23 మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 13.5 శాతం.  2022-23లో ఆర్థిక వృద్ధి అంచనా 7 శాతంగా ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో 6.3 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనావేసింది. డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో ఈ రేటు 4.6 శాతం చొప్పున ఉంటుందని అంచనావేసింది. తదుపరి ఆర్‌బీఐ పాలసీ సమీక్ష డిసెంబర్‌ 5 నుంచి 7 వరకూ జరగనున్న నేపథ్యంలో క్యూ2 జీడీపీ గణాంకాలు వెలువడనున్నాయి.

మరిన్ని వార్తలు