ఇక నల్లకుబేరుల పని అయిపోయినట్లే!

11 Oct, 2021 17:47 IST|Sakshi

ఆటోమేటిక్ సమాచార మార్పిడి ఒప్పందం కింద స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం ఆ దేశంలోని స్విస్ బ్యాంకులో గల భారతీయుల ఖాతా వివరాలను మూడోసారి కేంద్రానికి అందజేసింది. గోప్యతకు మారుపేరైన స్విస్‌ బ్యాంకుల్లో దాచిపెట్టిన నల్లధనం వివరాలను భారత్‌ నిరంతరం పొందడానికి ఈ ఆటోమేటిక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒప్పందం దోహదపడుతుంది. ఖాతా సంఖ్య, ఖాతాదారుడి పేరు, చిరునామా, పుట్టిన తేదీ, పన్ను గుర్తింపు సంఖ్య, వడ్డీ, డివిడెండ్, బీమా పాలసీల నుంచి చెల్లింపులు, క్రెడిట్‌ బ్యాలెన్స్, ఆస్తుల విక్రయం నుంచి లభించిన ఆదాయం తదితర అన్ని విషయాలను పరస్పరం మార్చుకోవచ్చు. 

ఈ యూరోపియన్ దేశం 96 దేశాలతో దాదాపు 33 లక్షల ఖాతాదారుల వివరాలను పంచుకున్నట్లు పేర్కొంది. ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌టిఎ) ఒక ప్రకటనలో ఈ ఏడాది సమాచార మార్పిడిలో మరో 10 దేశాలు పాల్గొన్నాయని తెలిపింది. ఆ దేశాలు ఆంటిగ్వా, బార్బుడా, అజర్ బైజాన్, డొమినికా, ఘనా, లెబనాన్, మకావ్, పాకిస్తాన్, ఖతార్, సమోవా, వౌటు. ఎఫ్‌టిఎ మొత్తం96 దేశాల పేర్లు, తదుపరి వివరాలను వెల్లడించనప్పటికీ, వరుసగా మూడవ సంవత్సరం సమాచారాన్ని అందుకున్న వారిలో భారతదేశం ఉన్నట్లు తెలిపింది. స్విస్ ఆర్థిక సంస్థలలో ఖాతాలు ఉన్న పెద్ద సంఖ్యలో వ్యక్తులు, కంపెనీలకు సంబంధించిన వివరాలు భారత అధికారులతో పంచుకున్నట్లు అధికారులు తెలిపారు. 

ఈ మార్పిడి గత నెలలో జరిగింది. తదుపరి సమాచార మార్పిడి స్విట్జర్లాండ్ సెప్టెంబర్ 2022లో పంచుకోనుంది. సెప్టెంబర్ 2019లో ఏఇఓఐ(ఆటోమేటిక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్) కింద స్విట్జర్లాండ్ నుంచి భారతదేశం మొదటి సెట్ వివరాలను అందుకుంది. ఆ సంవత్సరం అటువంటి సమాచారాన్ని పొందిన 75 దేశాలలో మన దేశం ఒకటి. రెండు దేశాల మధ్య ఇలాంటి ఒప్పందం కుదిరిన నాటి నుంచి అనేక మంది భారతీయులు స్విస్‌ బ్యాంకుల్లోని తమ అక్రమ డిపాజిట్లను ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు సమాచారం.(చదవండి: ఈ సారి జీమెయిల్, అవుట్ లుక్ యూజర్లను టార్గెట్ చేసిన హ్యాకర్లు)

మరిన్ని వార్తలు