రెండో జాబితా : సర్కార్‌ చేతిలో స్విస్‌ బ్యాంక్‌ ఖాతాల వివరాలు

9 Oct, 2020 20:13 IST|Sakshi

న్యూఢిల్లీ /బెర్న్‌ : స్విట్జర్లాండ్‌ బ్యాంకుల్లో భారతీయుల ఖాతాల వివరాలకు సంబంధించి రెండో జాబితా భారత్‌కు చేరింది. స్విట్జర్లాండ్‌తో సమాచార మార్పిడి ఒప్పందానికి (ఏఈఓఐ) అనుగుణంగా భారత్‌కు స్విట్జర్లాండ్‌ ఈ కీలక సమాచారం అందచేసింది. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనంపై ప్రభుత్వం చేపట్టిన పోరాటంలో ఇది మైలురాయిగా భావిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ ఒప్పందం కింద స్విట్జర్లాండ్‌ ఫెడరల్‌ ట్యాక్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) బ్యాంకు ఖాతాలపై సమాచారాన్ని అందిస్తున్న 86 దేశాల్లో భారత్‌ ఒకటి. ఏఈఓఐ కింద స్విస్‌ బ్యాంకుల్లో భారత పౌరుల బ్యాంకు ఖాతాల వివరాలకు సంబంధించి 2019 సెప్టెంబర్‌లో భారత్‌ స్విట్జర్లాండ్‌ నుంచి తొలి జాబితా అందుకుంది.  చదవండి : బంజారాహిల్స్‌లో గుట్టలుగా కరెన్సీ కట్టలు

ఈ ఏడాది 31 లక్షల ఫైనాన్షియల్‌ అకౌంట్లకు సంబంధించిన సమాచారాన్ని ఆయా దేశాలతో పంచుకున్నామని ఎఫ్‌డీఏ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. స్విస్‌ బ్యాంకుల్లో 86 దేశాలకు చెందిన 31 లక్షల ఖాతాల సమాచారాన్ని స్విట్జర్లాండ్‌ పంచుకోగా అందులో భారత జాతీయులు, సంస్ధల సంఖ్య  భారీగానే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. పన్ను ఎగవేత, ఇతర ఆర్థిక నేరాలకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా గత ఏడాదిగా భారత అధికారుల విజ్ఞప్తి మేరకు స్విస్‌ అధికారులు 100కు పైగా వ్యక్తులు, సంస్ధలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నారని అధికారులు తెలిపారు. ఇక చురుగ్గా ఉన్న ఖాతాలు, 2018లో మూసివేసిన ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని ఏఈఓఐలో భాగంగా స్విస్‌ అధికారులు భారత్‌తో పంచుకుంటారు. స్విస్‌ అధికారులు పంచుకున్న ఖాతాల్లో పనామా, బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌, కేమాన్‌ దీవులు వంటి విదేశాల్లో భారతీయులు నెలకొల్పిన కంపెనీలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు, రాజ కుటుంబాలకు చెందిన వ్యక్తుల వివరాలు ఉండవచ్చని భావిస్తున్నారు.

అయితే రెండో జాబితాలో వెల్లడించిన భారతీయుల ఖాతాల్లో ఎంత మొత్తం సంపద ఉందనే వివరాలను అధికారులు వెల్లడించలేదున. ఒప్పంద నిబంధనల్లో పొందుపరిచిన గోప్యతా క్లాజుల కారణంగా సమాచారాన్ని వెల్లడించలేమని అధికారులు చెబుతున్నారు. స్విస్‌ అధికారులు పంచుకునే సమాచారంలో స్విస్‌ బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఖాతాదారు పేరు, చిరునామా, నివసించే దేశం, పన్ను గుర్తింపు నెంబర్‌, ఆయా బ్యాంకుల పేర్లు, అకౌంట్‌లో బ్యాలెన్స్‌, క్యాపిటల్‌ ఇన్‌కం వంటి కీలక సమాచారం ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు తమ ట్యాక్స్‌ రిటన్స్‌లో సరైన సమాచారం అందించారా లేదా అనే కోణంలో పన్ను అధికారులు ఈ సమాచారాన్ని పరిశీలించేందుకు అనుమతిస్తారు. ఇక వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో స్విస్‌ అధికారులు తమ బ్యాంకుల్లో భారత జాతీయులు, వారి సారథ్యంలోని  సంస్ధల ఖాతాలకు సంబంధించిన సమచారంతో కూడిన మూడో జాబితాను భారత్‌కు అందచేస్తారు.

>
మరిన్ని వార్తలు