భారత్‌తో అంత ఈజీ కాదు! టెస్లా విషయంలో కేంద్రం తగ్గేదేలే.. ఎలన్‌ మస్క్‌ తగ్గేనా?

5 Feb, 2022 15:26 IST|Sakshi

టెస్లా విషయంలో సోషల్‌మీడియా ద్వారా భారత ప్రభుత్వం ఒత్తిడి తేవాలన్న ఆ కంపెనీ సీఈవో ఎలన్‌ మస్క్‌ ప్రయత్నాలు ఫలించడం లేదు. పైగా కేంద్రంతో సంబంధం లేకుండా తమ రాష్ట్రాలకు పెట్టుబడులకు రావాలంటూ టెస్లాకు పలు విజ‍్క్షప్తులు వెల్లువెత్తడం చూస్తున్నాం. అయినప్పటికీ ఈ విషయంలో కేంద్రం మాత్రం తగ్గట్లేదు. 

భారత్‌లో ఎంట్రీ ఇవ్వాలంటే.. ఈవీలపై దిగుమతి సుంకాలను తగ్గించాలన్నది టెస్లా డిమాండ్‌. కానీ, కేంద్రం మాత్రం అందుకు ససేమీరా అంటోంది. అంతేకాదు బడ్జెట్‌లో దిగుమతి సుంకాలపై ఏమైనా సడలింపులు ఉంటాయా? అని ఆశలు పెట్టుకుంది టెస్లా. అయితే అదీ నెరవేరలేదు. ఏది ఏమైనప్పటికీ ఈ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు  కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు చైర్మన్‌ వివేక్‌ జోహ్రీ.

‘ఇప్పటికే దేశీయంగా ఈవీల ఉత్పత్తి నడుస్తోంది. ఇప్పుడున్న టారిఫ్‌ వ్యవస్థతోనే పెట్టుబడులకు కొన్ని కంపెనీలు ముందుకొస్తున్నాయి. విదేశీ బ్రాండ్స్‌ సైతం విక్రయాలు చేపడుతున్నాయి. అలాంటప్పుడు వాళ్లకు మాత్రమే సమస్య ఉందా?’’ అంటూ పరోక్షంగా టెస్లాను నిలదీశారు వివేక్‌. కావాలనుకుంటే పాక్షికంగా తయారు చేసిన వాహనాలను దిగుమతి చేసి.. దేశీయంగా అసెంబ్లింగ్‌ చేసి అమ్ముకోవడచ్చని, తద్వారా దిగుమతి సుంకం 15-30 శాతం మధ్య ఉంటుందనే విషయాన్ని ఆయన మరోసారి ఉధ్ఘాటించారు.

 

దిగుమతి సుంకం సంగతి పక్కనపెడితే.. దేశీయంగా తయారీ యూనిట్‌, కంపెనీ భవిష్యత్‌ పెట్టుబడులపై ప్రణాళిక ఇవ్వనందునే.. టెస్లాకు మార్గం సుగమం కావట్లేదన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో భారత్‌ దిగుమతి సుంకాన్ని పెనుభారంగా భావిస్తున్న టెస్లా.. మూడేళ్లుగా కొనసాగిస్తున్న ప్రయత్నాలపై ముందుకు వెళ్తుందా? లేదంటే ఇక్కడితోనే ఆగిపోతుందా? ఎలన్‌ మస్క్‌ తగ్గుతాడా? అనే దానిపై మరికొన్ని రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

ఇక భారత్‌లో విదేశాల నుంచి దిగుమతి చేస్తున్న ఈవీలపై.. వాటి ధర 40వేల డాలర్లులోపు ఉంటే 60 శాతం, 40వేల డాలర్ల కంటే ఎక్కువగా ఉంటే 100 శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తున్నారు. సో.. ఈ లెక్కన టెస్లా గనుక విక్రయాలు మొదలుపెడితే(100 శాతం దిగుమతి సుంకంతో..) ధరలు భారీగా పెంచాల్సి ఉంటుంది. అప్పుడు బయ్యర్స్‌ ముందుకు రావడం కష్టమై.. భారత్‌ మార్కెట్‌ అట్టర్‌ఫ్లాప్‌ అవుతుంది. అందుకే  ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతి సుంకాన్ని తగ్గించాలని టెస్లా కోరుతోందని టెస్లా కథనం.

చదవండి: టెస్లా కార్ల‌లో సమస్య! 8ల‌క్ష‌ల కార్లు వెనక్కి

మరిన్ని వార్తలు