‘సెకండ్‌ వేవ్‌’తో వృద్ధికి సమస్య లేదు!

26 Mar, 2021 05:45 IST|Sakshi

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ విశ్వాసం

కోవిడ్‌ కేసులు పెరగడం ఆందోళనకరమే

అయినా దేశవ్యాప్త లాక్‌డౌన్‌లు ఉండకపోవచ్చు

వచ్చే పదేళ్లలో విభిన్న బ్యాంకింగ్‌ రంగాల్ని చూడబోతున్నామని వెల్లడి  

ముంబై: భారత్‌ను ప్రస్తుతం భయాందోళనలకు గురిచేస్తున్న కరోనా ‘సెకండ్‌ వేవ్‌’ వల్ల ఆర్థిక వృద్ధి రికవరీ బాటకు ఎటువంటి ఢోకా ఉండబోదన్న విశ్వాసాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గురువారం వ్యక్తంచేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2021–22) భారత్‌ 10.5 శాతం వృద్ధిని సాధిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆర్‌బీఐ గత నెల అంచనాలను తగ్గించాల్సి వస్తుందని తాను భావించడం లేదని అన్నారు.  కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళనకరమైన అంశమే అయినప్పటికీ, దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ల పరిస్థితి మళ్లీ తలెత్తుతుందని భావించనక్కర్లేదని అన్నారు. ఒక మీడియా గ్రూప్‌ ఏర్పాటు చేసిన ఎకనమిక్‌ సదస్సునుద్దేశించి చేసిన ప్రసంగంలో శక్తికాంతదాస్‌ బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టో కరెన్సీ నుంచి బ్యాంకింగ్‌ రంగంలో  సంస్కరణల వరకూ పలు అంశాలపై మాట్లాడారు. ఆయనేమన్నారంటే...

బాండ్‌ ఈల్డ్స్‌పై రుణ సమీకరణ ఎఫెక్ట్‌
ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారీ రుణ సమీకరణ ప్రణాళిక బాండ్‌ ఈల్డ్స్‌ (వడ్డీ) పెరుగుదలకు ప్రధాన కారణం. ఈ కారణంగానే 2020–21 ఆర్థిక సంవత్సరం చివరి దఫా రూ.20,000 కోట్ల బెంచ్‌మార్క్‌ బాండ్‌ వేలాన్ని ఈ నెల 22వ తేదీన కేంద్రం రద్దు చేసింది. ఆర్‌బీఐ–బాండ్‌ మార్కెట్‌ మధ్య ఎలాంటి ఘర్షణాత్మక పరిస్థితి లేదు.

క్రిప్టోకరెన్సీలపై ఆందోళన
బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టోకరెన్సీలపై ఆర్‌బీఐ ఆందోళన చెందుతోంది. ఇదే విషయాన్ని కేంద్రానికీ తెలియజేసింది. క్రిప్టోకరెన్సీలపై ఆర్‌బీఐ–ప్రభుత్వం మధ్య వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయని భావించడంలేదు. ఫైనాన్షియల్‌ స్థిరత్వ పటిష్టతకు ప్రభుత్వం, ఆర్‌బీఐ కట్టుబడి ఉన్నాయి. క్రిప్టోకరెన్సీపై ప్రభుత్వం, సెంట్రల్‌ బ్యాంక్‌ త్వరలో ఒక నిర్ణయానికి వస్తాయి.

బ్యాంకుల ప్రైవేటీకరణపై కేంద్రంతో చర్చలు
మరిన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ యత్నాల విషయంలో ఆర్‌బీఐ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. ఈ ప్రక్రియ కొనసాగుతుంది. బ్యాంకింగ్‌ పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది.  ఇందుకు పటిష్ట మూలధనం అవసరం. నైతిక విలువలతో కూడిన పాలనా వ్యవస్థలు ఉండాలి. నాలుగు కేటగిరీల్లో వచ్చే దశాబ్ద కాలంలో విభిన్న బ్యాంకింగ్‌రంగాన్ని భారత్‌ చూడబోతోంది. పోటీతత్వం, సామర్థ్యం వంటి అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది. భవిష్యత్‌ నాలుగు రకాల బ్యాంకులను చూస్తే... మొదటిగా పెద్ద బ్యాంకులు దేశీయంగా, అంతర్జాతీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తాయి. రెండవది... మధ్య తరహా బ్యాంకులు దేశ వ్యాప్తంగా ఆర్థి క సేవలు అందిస్తాయి.

మూడవ బ్యాంకింగ్‌ విభాగంలో చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులు,  ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు చిన్న రుణ గ్రహీతల అవసరాలను నెరవేర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక నాల్గవ రకం బ్యాంకింగ్‌లో డిజిటల్‌ ప్లేయర్స్‌ ఉంటాయి. ప్రత్యక్షంగాకానీ, బ్యాంకుల ద్వారాకానీ, ఏజెంట్లు, సంఘాల ద్వారాకానీ కస్టమర్‌కు ఇవి సేవలను అందిస్తాయి.  సామర్థ్యం, పోటీతత్వం ప్రధాన అంశాలుగా బ్యాంకులు, చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులు పేమెంట్‌ బ్యాంకులకు లైసెన్సింగ్‌ విధానం తీసుకురావడం ఒక కీలకమైన అడుగు.

మరిన్ని వార్తలు