భారత్‌లో స్టార్టప్‌ సంస్థల జోరు..

24 Mar, 2021 14:08 IST|Sakshi

వివిధ రంగాల్లో 100 సంస్థలు 

విలువ 240 బిలియన్‌ డాలర్లు పైనే 

క్రెడిట్‌ సూసీ ఇండియా వెల్లడి  

ముంబై: దేశీయంగా స్టార్టప్‌ సంస్థలు వేగంగా ఎదుగుతున్నాయి. ప్రస్తుతం వివిధ రంగాల్లో దాదాపు 100 సంస్థలు యూనికార్న్‌ స్థాయికి చేరాయి. వీటి మొత్తం వేల్యుయేషన్‌ 240 బిలియన్‌ డాలర్లకు పైగా ఉంటుందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ క్రెడిట్‌ సూసీ ఇండియా వెల్లడించింది. 1 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 7,000 కోట్లు) వేల్యుయేషన్‌ గల స్టార్టప్‌లను యూనికార్న్‌లుగా వ్యవహరిస్తారు. టెక్నాలజీతో పాటు ఫార్మా, కన్జూమర్‌ గూడ్స్‌ తదితర టెక్నాలజీ ఆధారిత రంగాల్లోనూ వీటి సంఖ్య గణనీయంగా పెరిగిందని క్రెడిట్‌ సూసీ ఇండియా ఈక్విటీ స్ట్రాటెజిస్ట్‌ నీలకంఠ్‌ మిశ్రా తెలిపారు. 100 యూనికార్న్‌లలో మూడింట రెండొంతుల సంస్థలు 2005 తర్వాతే ఏర్పాటయ్యాయని ఆయన పేర్కొన్నారు. భౌగోళికంగా చూస్తే అత్యధిక సంఖ్యలో యూనికార్న్‌లకు బెంగళూరు కేంద్రంగా ఉంది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌ (దేశ రాజధాని ప్రాంతం), ముంబై తర్వాత స్థానాల్లో ఉన్నాయి. చాలా యూనికార్న్‌ సంస్థలు త్వరలోనే ఎక్సే్చంజీల్లో లిస్టయ్యే అవకాశాలున్నాయని మిశ్రా వివరించారు.  

ఫిన్‌టెక్‌ సంస్థలు టాప్‌.. 
యూనికార్న్‌ క్లబ్‌లో ఎక్కువగా ఫైనాన్షియల్‌ టెక్నాలజీ (ఫిన్‌టెక్‌) సంస్థలు ఉన్నట్లు మిశ్రా తెలిపారు. వీటిలో ఐదు స్టార్టప్‌ల విలువ 22 బిలియన్‌ డాలర్ల పైచిలుకు ఉన్నట్లు వివరించారు. ‘భారతీయ ఫిన్‌టెక్‌ కంపెనీలు 10 బిలియన్‌ డాలర్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించాయి. దేశీ స్టార్టప్‌ వ్యవస్థకు సారథ్యం వహిస్తున్నాయి‘ అని క్రెడిట్‌ సూసీ ఇండియా సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ విభాగం హెడ్‌ ఆశీష్‌ గుప్తా తెలిపారు. డిజిటల్‌ చెల్లింపు సర్వీసులపై ఇన్వెస్టర్లకు ఆసక్తి పెరుగుతుండటం ఇందుకు కారణమని పేర్కొన్నారు.  

సాస్‌దే భవిష్యత్తు.. 
భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఎ సర్వీస్‌ (సాస్‌) రంగం అత్యంత ఆకర్షణీయమైన విభాగాల్లో ఒకటిగా ఉండగలదని మిశ్రా వివరించారు. దేశీయంగా ప్రస్తుతం 7,000 పైచిలుకు సాస్‌ కంపెనీలు ఉన్నాయన్నారు. సుశిక్షితులైన ఐటీ నిపుణుల లభ్యత గణనీయంగా పెరగడం, వ్యాపార ఏర్పాటు వ్యయాలు తక్కువగా ఉండటం, డిజిటల్‌ టెక్నాలజీ వినియోగం.. పెట్టుబడుల లభ్యత పెరుగుతుండటం తదితర అంశాలు సాస్‌ కంపెనీల ఏర్పాటుకు దోహదపడుతున్నాయని మిశ్రా వివరించారు. మరోవైపు, ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ (ఎడ్‌టెక్‌) రంగంపై కూడా ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారని, 2025 నాటికి ఈ విభాగం 5 రెట్లు వృద్ధి చెంది 4 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరగలదని  తెలిపారు. కే–12 (కిండర్‌గార్టెన్‌ స్థాయి నుంచి ఇంటర్ మీడియేట్‌ దాకా) విభాగంలో 1.5 బిలియన్‌ డాలర్ల  వ్యాపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

చదవండి:

ఏప్రిల్‌లో బ్యాంకులకు 12 రోజులు సెలవు

మరిన్ని వార్తలు