సాఫ్ట్‌వేర్‌ కోర్సులపై మహిళ ఆసక్తి, కోర్సెరాలో 48 లక్షల మంది కోచింగ్‌

18 Sep, 2021 12:00 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎడ్‌టెక్‌ దిగ్గజం కోర్సెరా ప్లాట్‌ఫాంలో వివిధ కోర్సులు నేర్చుకునేందుకు దేశీయంగా మహిళలు ఆసక్తిగా ముందుకొస్తున్నారు. ప్రస్తుతం భారత్‌లో తమ ప్లాట్‌ఫాంలో నమోదైన మహిళా లెర్నర్ల సంఖ్య 48 లక్షల పైచిలుకు ఉందని ’మహిళలు, నైపుణ్యాల నివేదిక’లో కోర్సెరా వెల్లడించింది. 

దీంతో తమ ప్లాట్‌ఫాంలో అత్యధికంగా మహిళా లెర్నర్ల విషయంలో భారత్‌ రెండో స్థానంలో ఉందని పేర్కొంది. దేశీయంగా ఆన్‌లైన్‌లో నేర్చుకునేందుకు మరింత మంది మహిళలు ఆసక్తి చూపుతున్నట్లు తమ అధ్యయనంలో వెల్లడైనట్లు కోర్సెరా తెలిపింది. 2019లో మొత్తం కొత్త లెర్నర్ల సంఖ్యలో మహిళల వాటా 37 శాతంగా ఉండగా, 2021లో ఇది 44 శాతానికి పెరిగిందని వివరించింది. 

కరోనా వైరస్‌ మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో.. ఉద్యోగ నియామకాల్లో పురుషులు, మహిళల మధ్య వ్యత్యాసం గణనీయంగా పెరగ్గా, ఆన్‌లైన్‌ లెర్నింగ్‌లో మాత్రం ఇది తగ్గిందని పేర్కొంది. ఉద్యోగాల్లో తిరిగి చేరడం కోసం కొత్త నైపుణ్యాలను నేర్చుకునేందుకు మహిళలు ఆన్‌లైన్‌ బాట పడుతున్నారని కోర్సెరా సీఈవో జెఫ్‌ మెజియోన్‌కాల్డా తెలిపారు. 

2016లో మొత్తం లెర్నర్ల సంఖ్యలో మహిళల వాటా 24 శాతంగా ఉండగా.. ప్రస్తుతం ఇది 38 శాతానికి పెరిగిందని నివేదిక పేర్కొంది. ఇక అంతర్జాతీయంగా మహిళా లెర్నర్ల సగటు వయస్సు 31గా ఉండగా భారత్‌లో ఇది 27గా ఉందని వివరించింది. చాలా మంది ఎక్కువగా స్టెమ్‌ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్‌) కోర్సులు, ఎంట్రీ స్థాయి ప్రొఫెషనల్‌ సర్టిఫికెట్లను ఎంచుకుంటున్నారని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కోర్సెరా ప్లాట్‌ఫాంపై 8.7 కోట్ల మంది యూజర్లు ఉండగా, భారత్‌లో వీరి సంఖ్య 1.25 కోట్లుగా ఉంది.  

చదవండి: సంప్రదాయ డిగ్రీలతోనూ..  సాఫ్ట్‌వేర్‌ జాబ్‌! 

మరిన్ని వార్తలు