మన యూనికార్న్‌లు 21

5 Aug, 2020 08:17 IST|Sakshi

చైనాతో పోలిస్తే పదో వంతు : హురున్‌ నివేదిక

ముంబై : దేశీయంగా యూనికార్న్‌ హోదా పొందిన (1 బిలియన్‌ డాలర్ల పైగా వేల్యుయేషన్‌ గలవి) స్టార్టప్‌లు 21 ఉన్నట్లు ఒక అధ్యయన నివేదికలో వెల్లడైంది. భారత సంతతికి చెందిన వారు విదేశాల్లో తీర్చిదిద్దిన యూనికార్న్‌ల సంఖ్య 40 పైచిలుకు ఉంటుంది. హురున్‌ గ్లోబల్‌ యూనికార్న్‌ జాబితాలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 21 దేశీ యూనికార్న్‌ల విలువ సుమారు 73.2 బిలియన్‌ డాలర్లుగా ఉంది. వీటిలో 11 సంస్థల్లో చైనాకు చెందిన ముగ్గురు ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారతీయులు స్థాపించిన యూనికార్న్‌ల విలువ 99.6 బిలియన్‌ డాలర్ల పైగా ఉంటుంది. యూనికార్న్‌ల సంఖ్యాపరంగా అమెరికా, చైనా, బ్రిటన్‌ తర్వాత భారత్‌ నాలుగో స్థానంలో ఉన్నట్లు హురున్‌ రిపోర్ట్‌ చైర్మన్‌ రూపర్ట్‌ హుగ్‌వర్ఫ్‌ తెలిపారు. అయితే, చైనాతో పోలిస్తే భారత్‌లో యూనికార్న్‌ల సంఖ్య పదో వంతు మాత్రమే ఉందని పేర్కొన్నారు. చైనాలో ఏకంగా 227 స్టార్టప్‌లు ఈ హోదా సాధించాయి. 

యూనికార్న్‌ల రాజధాని బెంగళూరు.. 
దేశీయంగా 21 యూనికార్న్‌లలో పేటీఎం, ఓయో రూమ్స్, బైజూస్, ఓలా క్యాబ్స్‌ మొదలైనవి ఉన్నాయి. 8 దిగ్గజ స్టార్టప్‌లకు కేంద్రమైన బెంగళూరు .. యూనికార్న్‌ల రాజధానిగా నిలుస్తోంది. సగటున ఒక స్టార్టప్‌ సంస్థ యూనికార్న్‌గా ఎదగడానికి భారత్‌లో ఏడేళ్లు పడుతోందని, అదే చైనాలో 5.5 సంవత్సరాలు, అమెరికాలో 6.5 ఏళ్లు పడుతోంది. భారత్‌–చైనా మధ్య సంబంధాలు ఘర్షణాత్మకంగా ఉంటున్నా చైనాకు చెందిన ఆలీబాబా 5 సంస్థల్లో, టెన్సెంట్‌ 3 సంస్థల్లో, డీఎస్‌టీ గ్లోబల్‌ 3 భారతీయ స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్‌ చేసినట్లు హురున్‌ నివేదిక పేర్కొంది. 

మరిన్ని వార్తలు