నవంబర్‌ 18 నుండి వరల్డ్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ అకౌంటెంట్స్‌

16 Nov, 2022 13:54 IST|Sakshi

ముంబై: ఈ నెల (నవంబర్‌) 18 నుండి 21 వరకు ముంబైలో 21వ వరల్డ్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ అకౌంటెంట్స్‌ (డబ్ల్యూసీవోఏ) జరగనుంది. ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ అకౌంటెంట్స్‌ (ఐఎఫ్‌ఏసీ) దీన్ని నిర్వహించనుంది. ఐఎఫ్‌ఏసీ 118 ఏళ్ల చరిత్రలో ఈ సదస్సును ముంబైలో నిర్వహించడం ఇదే ప్రథమమని  ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) ప్రెసిడెంట్‌ దేబాశీష్‌ మిత్రా తెలిపారు.

నాలుగేళ్లకోసారి జరిగే ఈ కాంగ్రెస్‌ను తొలిసారిగా 1904లో అమెరికాలోని సెయింట్‌ లూయిస్‌లో నిర్వహించారు. ముంబైలో జరిగే నాలుగు రోజుల సదస్సులో సుమారు 35 సెషన్లు ఉంటాయని, 150 మంది పైగా వక్తలు మాట్లాడతారని మిత్రా చెప్పారు. లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియుష్‌ గోయల్, పారిశ్రామికవేత్తలైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, అదానీ గ్రూప్‌ చీఫ్‌ గౌతం అదానీ తదితరులు వీరిలో ఉంటారని వివరించారు. డబ్ల్యూసీవోఏ చరిత్రలోనే అత్యధికంగా 9,000 మంది పైచిలుకు డెలిగేట్లు ఇందులో పాల్గొంటున్నట్లు మిత్రా తెలిపారు. 

చదవండి: Steve Jobs పాత చెప్పులు వేలం: రికార్డు ధర

మరిన్ని వార్తలు