తగ్గెదేలే.. మా ప్రయోజనాలే మాకు ముఖ్యం?

25 Apr, 2022 18:57 IST|Sakshi

రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసే విషయంలో అమెరికా సహా యూరప్‌ దేశాలు చెబుతున్న సూచనలను భారత్‌ పక్కన పెట్టింది. రష్యాతో సంబంధాల విషయంలో అమెరికాకు అనుగుణంగా మసలడం కంటే భారత ప్రయోజనాలే పరమావధిగా ముందుకెళ్లాలని నిర్ణయించింది.

రష్యా నుంచి డిస్కౌంట్‌ ధరకి లభిస్తున్న ముడి చమురును భారీగా కొనుగోలు చేస్తోంది ఇండియా. రాయిటర్‌ విశ్లేషణ ప్రకారం 2021లో మొత్తం కొనుగోలు చేసిన ముడి చమురు కంటే రెండింతలు అధికంగా ముడి చమురును ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైన తర్వాత ఇండియా కొనుగోలు చేసింది. ఉక్రెయిన్‌ రష్యా యుద్ధం నేపథ్యంలో 2022 ఫిబ్రవరి 24 నుంచి ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఇండియా రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురు కొనుగోలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. 

2021 ఏడాది మొత్తంలో ఇండియన్‌ రిఫైనరీ కంపెనీలు రష్యా నుంచి 16 మిలియన్‌ బ్యారెళ్ల ముడి చమురును కొనుగోలు చేశాయి. కానీ 2022 ఫిబ్రవరి 24న యుద్ధం ఉక్రెయిన్‌ రష్యా యుద్ధం మొదలైన తర్వాత ఒక్కసారిగా కొనుగోళ్లు జోరందుకున్నాయి. 2022 జూన్‌ వరకు కాలానికి ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీలు ఏకంగా 40 మిలియన్‌ బ్యారెళ్ల ముడి చమురు కావాలంటూ రష్యన్‌ కంపెనీలకు టెండర్లు దాఖలు చేశాయి.

ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ముడి చమురు దిగుమతిదారుగా ఇండియా ఉంది. ప్రతీ రోజు 5 మిలియన్‌ డాలర్ల ముడి చమురు దిగుమతి చేసుకుంటుంది. ఇందులో అధిక భాగం సౌదీ అరేబియా వంటి గల్ఫ్‌ దేశాల నుంచే వస్తోంది. అయితే గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చే ముడి చమురు బ్యారెల్‌ ధర భారీగా పెరిగింది. ఇప్పటికే లీటరు , పెట్రోలు డీజిల్‌ రేట్లు ఆల్‌టైం హైకి చేరుకున్నాయి. ద్రవ్యోల్బణం రోజురోజుకి పెరుగుతోంది. ఈ అంశాలేమీ పట్టించుకోకుండా రష్యా నుంచి తక్కువ ధరకు వచ్చే ఆయిల్‌ కొనద్దంటోంది అమెరికా. కానీ దేశ ప్రయోజనాల దృష్ట్యా రష్యా ముడి చమురును భారీగా కొనుగోలు చేస్తోంది ఇండియా. 

చదవండి: ఓఎన్‌జీసీ కొత్త ప్రాజెక్టులు షురూ

మరిన్ని వార్తలు