అయిదు చైనా ఉత్పత్తులపై యాంటీడంపింగ్‌ సుంకాలు

27 Dec, 2021 05:58 IST|Sakshi

లిస్టులో కొన్ని రకాల అల్యుమినియం ఉత్పత్తులు, రసాయనాలు

న్యూఢిల్లీ: కొన్ని రకాల అల్యుమినియం ఉత్పత్తులు, రసాయనాలు సహా చైనా నుంచి దిగుమతయ్యే అయిదు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం యాంటీడంపింగ్‌ సుంకం విధించింది. అయిదేళ్ల పాటు ఇది అమల్లో ఉంటుంది. పొరుగు దేశం నుంచి చౌక ఉత్పత్తులు వెల్లువెత్తడం వల్ల దేశీ తయారీదారులు దెబ్బతినకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నిర్దిష్ట ఫ్లాట్‌ రోల్డ్‌ అల్యుమినియం ఉత్పత్తులు, సోడియం హైడ్రో సల్ఫైట్‌ (అద్దకం పరిశ్రమలో ఉపయోగించేది), సిలికాన్‌ సీలెంట్‌ (సోలార్‌ ఫోటోవోల్టెయిక్‌ మాడ్యూల్స్‌ తయారీలో ఉపయోగపడేది), హైడ్రోఫ్లూరోకార్బన్‌ కాంపోనెంట్‌ ఆర్‌–32 .. హైడ్రోఫ్లూరోకార్బన్‌ బ్లెండ్స్‌ (రెండింటిని రిఫ్రిజిరేషన్‌ పరిశ్రమలో వాడతారు) వీటిలో ఉన్నాయి. 

వాణిజ్య శాఖలో భాగమైన డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ట్రేడ్‌ రెమెడీస్‌ (డీజీటీఆర్‌) నిర్వహించిన దర్యాప్తులో ఈ ఉత్పత్తులను భారత మార్కెట్లో సాధారణ తయారీ రేటు కన్నా చాలా తక్కువకు చైనా ఎగుమతి చేస్తున్నట్లు తేలింది. ఇలా భారీ స్థాయిలో వచ్చి పడుతున్న దిగుమతుల వల్ల (డంపింగ్‌) దేశీ పరిశ్రమ నష్టపోతోందని వెల్లడైంది. దీంతో డీజీటీఆర్‌ సిఫార్సుల ప్రకారం ప్రభుత్వం సుంకాలు విధించింది. మరోవైపు, ఇరాన్, ఒమన్‌ తదితర దేశాల నుంచి కాల్సైన్డ్‌ జిప్సం పౌడరుపైనా యాంటీ డంపింగ్‌ సుంకం విధించింది. ఈ ఏడాది ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్య కాలంలో చైనాకు భారత్‌ నుంచి ఎగుమతులు కేవలం 12.26 బిలియన్‌ డాలర్లుగా ఉండగా.. దిగుమతులు ఏకంగా 42.33 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

>
మరిన్ని వార్తలు