3 శాతం పెరిగి, జులైలో కార్పొరేట్‌ డీల్స్‌ రూ.97,680 కోట్లు

11 Aug, 2021 08:26 IST|Sakshi

ముంబై: దేశీయంగా కార్పొరేట్‌ డీల్స్‌ (ఒప్పందాలు) జూలై నెలలో 3 శాతం పెరిగి 13.2 బిలియన్‌ డాలర్లు (రూ.97,680 కోట్లు)గా నమోదైనట్టు గ్రాంట్‌ థార్న్‌టన్‌ భారత్‌ ఓ నివేదిక రూపంలో తెలిపింది. అంతక్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 3 శాతం పెరగ్గా.. ఈ ఏడాది జూన్‌ నెలతో పోలిస్తే 6 శాతం పురోగతి కనిపించింది.

కరోనా తర్వాత కంపెనీలు తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే వ్యూహంలో భాగంగా చౌకగా నిధులు సమీకరించడంతోపాటు.. నగదు నిల్వలను ఖర్చు పెట్టడంపై దృష్టి సారించినట్టు గ్రాంట్‌ థార్న్‌టన్‌ పార్ట్‌నర్‌ శాంతి విజేత తెలిపారు. రానున్న నెలల్లోనూ ఒప్పందాలు సానుకూలంగానే ఉంటాయని అంచనా వేశారు.

 జూలై నెలలో విలీనాలు, కొనుగోళ్లకు సంబంధించి (ఎంఅండ్‌ఏ) 36 ఒప్పందాలు నమోదయ్యాయి. వీటి విలువ 5.6 బిలియన్‌ డాలర్లుగా ఉంది. సంఖ్యా పరంగా చూస్తే 13 శాతం పెరిగాయి. కానీ విలువ పరంగా ఎంఅండ్‌ఏ ఒప్పందాల విలువ 37 శాతం తగ్గింది. ప్రైవేటు ఈక్విటీ, వెంచర్‌ క్యాపిటల్‌ పెట్టుబడులకు సంబంధించి 145 ఒప్పందాలు నమోదు కాగా.. వీటి విలువ 7.5 బిలియన్‌ డాలర్లుగా ఉంది.  

ఐటీ సొల్యూషన్స్, ఈ కామర్స్, కన్జ్యూమర్‌ రిటైల్, డిజిటల్‌ హెల్త్‌కేర్, ఫిన్‌టెక్, ఎడ్‌టెక్‌ కంపెనీల విభాగాల్లో లావాదేవీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఈక్విటీ మార్కెట్లు పెరగడం, నగదు లభ్యత అధికంగా ఉండడం, కరోనా కారణంగా ప్రయోజనం పొందే రంగాల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరగడం సానుకూలించినట్టు గ్రాంట్‌ థార్న్‌టన్‌ పేర్కొంది.  

చదవండి: భవిష్యత్తులో ఏం జరుగుతుందో, కనిపెట్టే పనిలో అమెరికా

మరిన్ని వార్తలు