కోవిడ్‌లోనూ కొనుగోళ్లు, విలీనాల జోష్‌

12 May, 2021 15:13 IST|Sakshi

ఏప్రిల్‌లో 161 ఒప్పందాలు 

దశాబ్ద కాలంలో అత్యధికం 

విలువ రూ. 2,22,000 కోట్లు 

ముంబై: దేశీయంగా కోవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ విలయం సృష్టిస్తున్నప్పటికీ ఏప్రిల్‌లో రికార్డ్‌ స్థాయిలో ఒప్పందాలు జరిగాయి. ప్రయివేట్‌ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు, కంపెనీల కొనుగోళ్లు, విలీనాల(ఎంఅండ్‌ఏ) విషయంలో గత నెలలో మొత్తం 161 డీల్స్‌ కుదిరాయి. ఏ నెలను తీసుకున్నా గత దశాబ్ద కాలంలో ఇవి అత్యధికంకాగా.. వీటి విలువ 13 బిలియన్‌ డాలర్లుకావడం విశేషం! అంటే సుమారు రూ. 96,200 కోట్లు!! గ్లోబల్‌ కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్‌ థార్టన్‌ నివేదిక ప్రకారం ఏప్రిల్‌లో దేశీయంగా ఎంఅండ్‌ఏ విభాగంలో అత్యధికంగా 30 లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ. 37,000 కోట్లు(5 బిలియన్‌ డాలర్లు).  

రెట్టింపునకు 
దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రకటించిన 2020 ఏప్రిల్‌తో పోలిస్తే గత నెలలో డీల్స్‌ సంఖ్య రెట్టింపునకు ఎగసింది. మొత్తం డీల్స్‌ విలువలో సైతం 50 శాతం వృద్ధి నమోదైనట్లు గ్రాంట్‌ థార్టన్‌ నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌లకు తెరలేవడం, కరోనా వైరస్‌ సోకిన కేసులు అత్యంత వేగంగా పెరిగిపో తుండటం వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఒప్పందాలు జోరందుకోవడం గమనార్హం. మరోవైపు సరికొత్త రికార్డులను తాకుతున్న కోవిడ్‌–19 కేసులు ఆర్థిక రికవరీని దెబ్బతీసే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే  స్టాక్‌ మార్కెట్లు స్వల్ప ఒడి దొడుకులు ఎదుర్కొన్నప్పటికీ పటిష్ట లాభాలతో కదులుతుండటం ఆశ్చర్యకరమన్నారు.

మార్చితో పోలిస్తే 
ఈ(2021) మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో ఒప్పందాల సంఖ్య 18 శాతం పుంజుకోగా.. వీటి విలువ ఏకంగా 174 శాతం ఎగసినట్లు నివేదిక తెలియజేసింది. మొత్తంగా గత నెలలో ఎంఅండ్‌ఏ విభాగంలో 42 డీల్స్‌ కుదిరాయి. వీటి విలువ 5.5 బిలియన్‌ డాలర్లు. అయితే గతేడాది ఏప్రిల్‌లో 5.7 బిలియన్‌ డాలర్ల విలువైన ఫేస్‌బుక్‌-జియో ప్లాట్‌ఫామ్స్‌ డీల్‌ కారణంగా కొనుగోళ్లు, విలీనాల విభాగం డీల్స్‌ విలువ 30 శాతం క్షీణించినట్లు లెక్క. ఈ డీల్‌ను మినహాయిస్తే.. 2021 ఏప్రిల్‌ డీల్స్‌ విలువ 2.5 రెట్లు ఎగశాయని నివేదిక వివరించింది.  మొత్తం ఎంఅండ్‌ఏ డీల్స్‌లో దేశీ వాటా  91 శాతంకాగా.. విలువరీత్యా 76 శాతాన్ని ఆక్రమించాయి. 

పీఈ సైతం.. 
ఈ ఏప్రిల్‌లో పీఈ పెట్టుబడులు జోరందుకున్నాయి. మొత్తం 119 లావాదేవీల ద్వారా 7.6 బిలియన్‌ డాలర్ల(రూ. 56,240 కోట్లు)ను ఇన్వెస్ట్‌ చేశాయి. 2011 తదుపరి ఇప్పటివరకూ ఏ నెలలోనైనా ఇవే గరిష్టం! గత నెలలో ఐదు స్టార్టప్, ఈకామర్స్‌ కంపెనీలు యూనికార్న్‌ క్లబ్‌లో చేరాయి. తద్వారా దేశీ స్టార్టప్‌ వ్యవస్థ సైతం కొత్త చరిత్రకు నెలవైంది. ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, ఈకామర్స్, ఎడ్యుకేషన్, తయారీ, ఇంధనం, సహజ వనరులు రంగాలు గరిష్ట పెట్టుబడులను ఆకట్టుకున్నాయి.

చదవండి:

అగ్రి స్టార్టప్స్‌.. దున్నేస్తున్నాయ్‌!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు