ఆగస్ట్‌లో డీల్స్‌ జూమ్‌

14 Sep, 2021 06:28 IST|Sakshi

కొనుగోళ్లు, విలీనాలు 21 శాతం అప్‌

ముంబై: గత నెల(ఆగస్ట్‌)లో దేశీ కార్పొరేట్‌ ప్రపంచంలో డీల్స్‌ భారీగా ఎగశాయి. మొత్తం 219 డీల్స్‌ జరిగాయి. 2005 తదుపరి ఇవి అత్యధికంకాగా.. 2020 ఆగస్ట్‌తో పోల్చినా రెట్టింపయ్యాయి. వీటి విలువ 8.4 బిలియన్‌ డాలర్లు. కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్‌ థార్న్‌టన్‌ అందించిన వివరాలివి. అయితే ఈ(2021) జులైతో పోలిస్తే లావాదేవీలు పరిమాణంలో 21 శాతం ఎగసినప్పటికీ విలువలో 36 శాతం క్షీణించాయి. ఇందుకు విలీనాలు, కొనుగోళ్ల(ఎంఅండ్‌ఏ) విభాగంలో యాక్టివిటీ ఆరు రెట్లు పడిపోవడం కారణమైంది. ఆగస్ట్‌లో ప్రధానంగా ప్రయివేట్‌ ఈక్విటీ, వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్స్‌ ద్వారానే అత్యధిక డీల్స్‌ నమోదయ్యాయి. 182 లావాదేవీల ద్వారా 7.6 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేశాయి. దేశీ కంపెనీలు, యూనికార్న్‌(స్టార్టప్‌లు) ఇందుకు వేదికయ్యాయి. లాభదాయక అవకాశాలు, ఆర్థిక రికవరీపై విశ్వాసం, పరిశ్రమల స్థాపనలో నైపుణ్యం వంటి అంశాలు ప్రభావం చూపాయి.   

యూనికార్న్‌ల స్పీడ్‌
పారిశ్రామిక పురోగతి, బలపడుతున్న డిమాండ్, ఆర్థిక రికవరీ నేపథ్యంలో ఇకపై సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశమున్నట్లు గ్రాంట్‌ థార్న్‌టన్‌ నిపుణులు శాంతి విజేత పేర్కొన్నారు. వ్యాక్సినేషన్లు, విధానాల మద్దతు, ప్రపంచ దేశాల పురోభివృద్ధి ఇందుకు మద్దతుగా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎంఅండ్‌ఏ విభాగంలో 86.7 కోట్ల డాలర్ల విలువైన 37 డీల్స్‌ జరిగాయి. 2020 ఆగస్ట్‌లో 90.8 కోట్ల డాలర్ల విలువైన 30 లావాదేవీలు నమోదయ్యాయి. టెక్, ఎడ్యుకేషన్, ఫార్మా, ఎనర్జీ రంగాలలో అధిక డీల్స్‌ జరిగాయి. గత నెలలో ఏడు స్టార్టప్‌లో యూనికార్న్‌ హోదాను అందుకున్నాయి. బిలియన్‌ డాలర్ల విలువను సాధించిన స్టార్టప్‌లను యూనికార్న్‌లుగా వ్యవహరించే సంగతి తెలిసిందే. దేశీ స్టార్టప్‌ వ్యవస్థ 115 డీల్స్‌ ద్వారా 1.4 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకుంది.

మరిన్ని వార్తలు