ఉద్యోగుల కోసం పోటీ పడుతున్న కంపెనీలు

7 Sep, 2021 17:28 IST|Sakshi

దేశంలో ఆర్ధిక వృద్ది తిరిగి పెరగడంతో ప్రతిభ గల ఉద్యోగుల కోసం చాలా కంపెనీలు పోటీ పడుతున్నాయి. దీనికోసం కంపెనీలు బయట నుంచి వస్తున్న పోటీని తట్టుకోవడం కోసం తమ ఉద్యోగులకు భారీగా వేతనాన్ని పెంచడానికి సిద్ద పడుతున్నాయి. వేతన పెంపు విషయమై అయాన్ అనే సంస్థ 39 పరిశ్రమల్లో 1,300 సంస్థలతో 26వ వార్షిక వేతన పెంపు సర్వేను నిర్వహించిది. ఈ సర్వే ప్రకారం.. ఇండియా ఇంక్ 2022లో సగటున వేతనాన్ని 9.4 శాతం పెంచే అవకాశం ఉంది. ఈ సూచిక బలమైన ఆర్ధిక రికవరీని సూచిస్తుంది. గత సంవత్సరం వేతన పెంపు కంటే 8.8 శాతం ఎక్కువ. (చదవండి: కరోనా చికిత్సకు ‘హెటెరో’ బూస్ట్‌)

అయాన్ నివేదిక ప్రకారం.. దేశంలో వ్యాపార కార్యకలాపాలు వేగంగా తిరిగి పుంజుకుంటున్నాయి. 2022లో టెక్నాలజీ, ఈ-కామర్స్, ఐటీ ఆధారిత రంగాలలో అత్యధిక వేతన పెంపు ఉండే అవకాశం ఉంది. ఇంజనీరింగ్ సేవలు, శక్తి, ఆతిథ్యం వంటి రంగాలలో అతి తక్కువ పెంపు అనేది ఉండనుంది. ఇంకా, 98.9 శాతం కంపెనీలు ఏడాది క్రితం 97.5 శాతంతో పోలిస్తే 2022లో ఉద్యోగుల వేతనాన్ని పెంచాలని భావిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఇది ఇలా ఉంటే ఎటువంటి వేతన పెంపు అమలు చేయని కంపెనీల సంఖ్య  2.5 శాతం నుంచి 1.1 శాతానికి తగ్గింది. చాలా మంది ఉద్యోగులు ఎక్కువ వేతనాన్ని ఆఫర్ చేసే సంస్థలో జాయిన్ అవ్వడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది. 

కరోనా మహమ్మరి తర్వాత డిజిటల్ టెక్నాలజీకి డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో చాలా కంపెనీలు అత్యుత్తమ మానవ వనరులకు ఎక్కువ జీతాన్ని అందించడానికి సిద్దపడుతున్నాయి. ఉత్తమ ప్రతిభ గల ఉద్యోగుల కోసం సంస్థలు తమ వ్యూహాలను రచిస్తున్నాయని సర్వేలో తేలింది. "అత్యధిక అట్రిషన్ రేటు గల రంగాలలో ఐటీ టెక్నాలజీ, ఈ-కామర్స్, ఆర్థిక సంస్థలు" ముందు వరుసలో ఉన్నాయని ఇటీవల రూపంక్ చౌదరి చెప్పారు. అలాగే ఆడిట్, పన్ను, చట్టపరమైన సేవలకు భారీ డిమాండ్ ఉన్నందున వృత్తిపరమైన సేవ రంగాలలో కూడా అధిక అట్రిషన్ రేటు ఉన్నట్లు ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు