Afghanistan: అమెరికా నిర్ణయం.. భారత్‌కు భారీ నష్టం

17 Aug, 2021 16:50 IST|Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌: క్షేత్రస్థాయిలో పరిస్థితులు సరిగా అంచనా వేయకుండా హడావుడిగా అమెరికా తీసుకున్న నిర్ణయం ఇటు అఫ్ఘన్‌తో పాటు భారత్‌కి శాపంగా మారింది. ఇంటిలిజెన్స్‌లో తమకు తిరుగులేదని చెప్పుకునే అమెరికా తాను పప్పులో కాలేయడమే కాకుండా తనని నమ్మిన అఫ్ఘన్లకు, వారికి అండగా నిలిచిన ఇండియాకు నష్టాన్ని తెచ్చింది.

బిన్‌లాడెన్‌తో మొదలు
ఓసామా బిన్‌లాడెన్‌ పీచమణిచే లక్ష్యంతో 2001లో వైమానికదాడులతో అఫ్ఘనిస్తాన్‌లో అమెరికా అడుగు పెట్టింది. ఆ తర్వాత తాలిబన్లను గద్దె నుంచి తోసి తమకు అనుకూలంగా ఉండే హమీద్‌ కర్జాయ్‌ని దేశ అధ్యక్షుడిని చేసింది. ఆ తర్వాత అక్కడ ప్రజాస్వామ్యం పునరుద్ధరిస్తామంటూ చెప్పింది. దీంతో అఫ్ఘనిస్తాన్‌ పునర్మిణం పేరుతో ప్రపంచ దేశాలు సాయం అందించాయి. ఈ క్రమంలో గడిచిన 20 ఏళ్లలో అఫ్ఘన్‌లో పలు ప్రాజెక్టులపై ఇండియా 3 బిలియన్‌ డాలర్లను ఖర్చు చేసింది.  ద్వైపాక్షిక సంబంధాలు బలపడ్డాయి. ఇరు దేశాల మధ్య కీలకమైన వాణిజ్య ఒప్పందం 2019-20లో జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో గతంలో కుదిరిన ఒప్పందాలు అమలయ్యేది లేదని తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. 

ఇండియా సాయం
- ఇరవై ఏళ్ల కాలంలో అఫ్ఘనిస్తాన్‌ పునర్‌ నిర్మాణం కోసం 3 బిలియన్‌ డాలర్లు ఇండియా ఖర్చు చేసింది. వీటితో ఆ దేశంలోని 34 ప్రావిన్సుల్లో మొత్తం 400 పనులు చేపట్టింది. ఇందులో చాలా వరకు పూర్తవగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి.
- నీటి వనరులు పరిమితంగా ఉండే అఫ్ఘనిస్తాన్‌లో 42 మెగావాట్ల జలవిద్యుత్‌ సామర్థ్యంతో సాల్మా జల విద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించింది. ఈ డ్యామ్‌ వాటర్‌తో కాబుల్‌ జిల్లాలో రెండు వేల గ్రామాలకు మంచినీటిని అందించే వీలుంది.


- 90 మిలియన్ డాలర్ల వ్యయంతో అఫ్ఘనిస్తాన్‌ పార్లమెంటు భవనాన్ని ఇండియా నిర్మించింది. 2015లో ప్రధానీ మోదీ దీన్ని ప్రారంభించారు. 
- 19వ శతాబ్ధంలో నిర్మించిన స్టార్‌ ప్యాలెస్‌ పునరుద్ధరణ పనులు ఇండియాకు చెందిన ఆగాఖాన్‌ ట్రస్ట్‌ చేపట్టింది.  2013లో పనులు ప్రారంభించి 2016లో పూర్తి చేసింది.
- 80 మిలియన​ డాలర్ల వ్యయంతో కాబూల్‌ జిల్లాలో శతూత్‌ డామ్‌ నిర్మాణానికి ఇండియా అంగీకరించింది. ఈ డామ్‌ నిర్మాణం పూర్తయితే ఇరవై లక్షల కుటుంబాలకు తాగునీటి సమస్య తీరిపోయి ఉండేది.
- అఫ్ఘనిస్తాన్‌, ఇండియాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఇరు దేశాల మధ్య వన్‌ బిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరుగుతుందని 2019-20లో అంచనా వేశారు. ప్రస్తుతం ఈ ఒప్పందం ఎంత మేరకు అమలవుతుందనేది సందేహంలో పడింది. 
- ద్వైపాక్షిక ఒప్పందలో భాగంగా అఫ్ఘనిస్తాన్‌ వస్తువులకు ఇండియాలో పన్ను రాయితీలు కల్పించారు. 

ఏం జరుగుతుందో 
- 150 మిలియన్‌ డాలర్ల వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరాజ్‌ - దేలారమ్‌ హైవేను మన దేశానికి చెందిన బోర్డర్‌ రోడ్‌ ఆర్గనైజేషన్‌ నిర్మించింది. ఈ హైవే నిర్మాణం వల్ల ఇరాన్‌లో ఉన్న చాహబార్‌ పోర్టుతో రోడ్‌ కనెక్టివిటీ ఉంటుందని, గల్ఫ్‌ దేశాలతో పాటు యూరప్‌కి వాణిజ్య మార్గం అవుతుందని ఇండియా అంచనా
- పాకిస్తాన్‌తో ఉన్న వైరం కారణంగా అఫ్ఘనిస్తాన్‌ మీదుగా చబహార్‌ పోర్టు ఉండే కనెక్టివిటీ ఇండియాకు ఎంతో ఉపయోకరంగా ఉండేది. ఇప్పుడు ఈ హైవే వాడకంపై ఆంక్షలు ఉండవచ్చు.


- రెండు దేశాల మధ్య స్నేహానికి ప్రతీకగా అఫ్ఘనిస్తాన్‌ అధ్యక్ష భవనాన్ని ఇండియా నిర్మించించింది. ప్రస్తుతం ఈ భవనం తాలిబన్లు ఆక్రమించుకున్నారు.
- పాకిస్తాన్‌ దేశం తరచుగా తన గగనతలంపై ఆంక్షలు విధిస్తోంది. దీని వల్ల విమానయానరంగంపై అదనపు భారం పడుతోంది. ఇప్పుడు అఫ్ఘనిస్తాన్‌ సైతం ఇలాంటి నిర్ణాయాలు అమలు చేస్తే విమాన ప్రయాణం మరింత దూరభారం, ఆర్థిక భారంగా మారుతుంది.
 

>
మరిన్ని వార్తలు