గ్లోబల్‌ బయోఫ్యూయల్స్‌ కూటమిలో భాగం కండి

18 Nov, 2023 01:20 IST|Sakshi

‘గ్లోబల్‌ సౌత్‌’ దేశాలకు భారత్‌ పిలుపు

న్యూఢిల్లీ: ఇటీవల ప్రారంభించిన గ్లోబల్‌ బయోఫ్యూయల్స్‌ అలయన్స్‌లో భాగం కావాలని గ్లోబల్‌ సౌత్‌ దేశాలకు భారత్‌ పిలుపునిచి్చంది. జీవఇంధనాల అభివృద్ధికి సంబంధించిన నైపుణ్యాలను వర్ధమాన దేశాలు, అంతగా అభివృద్ధి చెందని దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. 2వ వాయిస్‌ ఆఫ్‌ గ్లోబల్‌ సౌత్‌ సదస్సులో పాల్గొన్న కేంద్ర చమురు శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి ఈ మేరకు పిలుపునిచ్చారు.

పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్‌ని కలిపి వినియోగంలోకి తేవాలన్న లక్ష్యాన్ని అయిదు నెలల ముందుగా 2022 మేలో భారత్‌ సాధించిందని, దీన్ని 20 శాతానికి పెంచుకోవాలన్న లక్ష్యాన్ని అయిదేళ్లు ముందుకు జరిపి 2025కి మార్చుకుందని ఆయన చెప్పారు. బయోమాస్‌ను ఇంధనంగా మార్చడం ద్వారా ఇటు రైతులకు అదనపు ఆదాయ వనరును అందుబాటులోకి తేవడంతో పాటు కర్బన ఉద్గారాల తగ్గింపునకు కూడా భారత్‌ కృషి చేస్తోందని పురి వివరించారు.

ఇందుకు సంబంధించి టెక్నాలజీ బదలాయింపు, సంయుక్త పరిశోధన .. అభివృద్ధి కార్యకలాపాలు, మానవ వనరుల నైపుణ్యాభివృద్ధి తదితర అంశాల్లో ఇతర గ్లోబల్‌ సౌత్‌ దేశాలతో కలిసి పని చేసేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. బయోమాస్‌ నుంచి తయారు చేసే జీవ ఇంధనాలను ప్రపంచవ్యాప్తంగా వినియోగంలోకి తెచ్చే లక్ష్యంతో గ్లోబల్‌ బయోఫ్యూయల్‌ అలయెన్స్‌ ఏర్పడింది. ఇందులో అమెరికా, బ్రెజిల్‌ వంటి దేశాలు భాగంగా ఉన్నాయి. కొన్ని దేశాలు మినహా ఉత్తరార్ధగోళంలో ఉన్న మెజారిటీ దేశాలను గ్లోబల్‌ నార్త్‌గాను, దక్షిణార్ధగోళంలో ఉన్న దేశాలను గ్లోబల్‌ సౌత్‌గాను వ్యవహరిస్తున్నారు. 

మరిన్ని వార్తలు