దేశీ మార్కెట్‌లో మరింత వృద్ధిపై లంబోర్గిని దృష్టి

24 Mar, 2023 04:31 IST|Sakshi

కంపెనీ చైర్మన్‌ స్టెఫాన్‌ వింకెల్‌మాన్‌

న్యూఢిల్లీ: భారత మార్కెట్లో వ్యాపార వృద్ధిపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు సూపర్‌స్పోర్ట్స్‌ కార్ల తయారీ దిగ్గజం లంబోర్గిని చైర్మన్‌ స్టెఫాన్‌ వింకెల్‌మాన్‌ తెలిపారు. ముందుగా హైబ్రిడ్‌ వాహనాలు.. ఆ తర్వాత పూర్తి స్థాయి ఎలక్ట్రిక్‌ వాహనాలు ఇందుకు దోహదపడగలవని ఆయన చెప్పారు. భౌగోళికరాజకీయ పరిస్థితులతో అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో తమకు అవసరమయ్యే విడిభాగాలు మొదలైన వాటిని ఇతరత్రా మరిన్ని దేశాల నుంచి కొనుగోలు చేస్తున్నామని వింకెల్‌మాన్‌ చెప్పారు. దీనితో భారతీయ విడిభాగాల సరఫరా సంస్థలకు కూడా వ్యాపార అవకాశాలు లభించగలవని ఆయన తెలిపారు.

భారత్‌లో భారీగా పన్నులు, మౌలికసదుపాయాలపరమైన సవాళ్లు ఉన్నప్పటికీ.. వృద్ధికి కూడా అవకాశాలు బాగానే ఉన్నాయని వింకెల్‌మన్‌ చెప్పారు. అయితే, వృద్ధి ఎంత స్థాయిలో ఉండొచ్చనేది చెప్పలేనని పేర్కొన్నారు. హైబ్రిడ్, ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రవేశపెట్టబోతున్నట్లు 2021లో కంపెనీ ప్రకటించింది. దీని ప్రకారం 2023లో తొలి హైబ్రిడ్‌ మోడల్‌ను (విద్యుత్, ఇంధనంతో నడిచేది) ప్రవేశపెట్టనుంది. 2024 ఆఖరు నాటికి ప్రస్తుతం తమకున్న మోడల్స్‌ శ్రేణి మొత్తాన్ని ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చనుంది. లంబోర్గిని గత ఏడా ది భారత్‌లో 92 వాహనాలు విక్రయించింది. అంతక్రితం ఏడాది 2021లో నమోదైన 69 యూనిట్లతో పోలిస్తే ఇది 33 శాతం అధికం.

మరిన్ని వార్తలు