6వ అతిపెద్ద బీమా మార్కెట్‌గా అవతరించనున్న భారత్‌!

5 Sep, 2022 07:17 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ వచ్చే పదేళ్లలో ఆరో అతిపెద్ద బీమా మార్కెట్‌గా అవతరిస్తుందని ‘స్విస్‌ రీ ఇనిస్టిట్యూట్‌’ అంచనా వేసింది. నియంత్రణ సంస్థ నుంచి మద్దతు, ఆర్థిక కార్యకలాపాల విస్తరణ ఇందుకు చేదోడుగా నిలుస్తాయని అభిప్రాయపడింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది.

ఆరో అతిపెద్ద బీమా మార్కెట్‌గా అవతరించేందుకు భారత్‌.. వచ్చే పదేళ్ల కాలం పాటు ఏటా 14 శాతం మేర బీమా ప్రీమియంలో వృద్ధి నమోదు కావాలని సూచించింది. ప్రస్తుతం బీమా ప్రీమియం పరంగా భారత్‌ ప్రపంచంలో పదో స్థానంలో ఉంది. భారత జీవిత బీమా రంగం 2022లో 6.6 శాతం మేర, 2023 నుంచి 7.1 శాతం మేర వృద్ధిని సాధిస్తుందని స్విస్‌రీ అంచనా వేసింది. మొత్తం జీవిత బీమా ప్రీమియం 2022లో మొదటిసారి 100 బిలియన్‌ డాలర్లు దాటుతుందని తెలిపింది. జీవితేతర బీమా మారెŠక్‌ట్‌ గురించి చర్చిస్తూ.. 2021లో 5.8 శాతం మేర ప్రీమియంలో వృద్ధి నమోదైనట్టు, 2022లో 4.5 శాతం వృద్ధికి పరిమితం కావచ్చని పేర్కొంది.

అధిక ద్రవ్యోల్బణాన్ని ఇందుకు కారణంగా పేర్కొంది. 2023–2032 మధ్య ఏటా 8 శాతం కాంపౌండెడ్‌ వృద్ధి రేటును నమోదు చేస్తుందని అంచనా వేసింది. ముఖ్యంగా కరోనా మమమ్మారి ప్రవేశం తర్వాత వ్యవస్థీకృత మార్పు జీవితేతర బీమా (ఆరోగ్య బీమా)లో చోటు చేసుకున్నట్టు తెలిపింది. కరోనా వల్ల రిస్క్‌పై అవగాహన ఏర్పడి, హెల్త్‌ ఇన్సూరెన్స్‌కు డిమాండ్‌ గణనీయంగా పెరిగినట్టు వివరించింది. 2022లో భారత్‌ ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని స్విస్‌ రీ ఇనిస్టిట్యూట్‌ అంచనా వేసింది.    

మరిన్ని వార్తలు