ద్రవ్యోల్బణ సవాళ్లలోనూ జోరుమీదున్న తయారీ రంగం

3 May, 2022 13:02 IST|Sakshi

న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం సవాళ్లలోనూ 2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌లో తయారీ రంగం దూసుకుపోయింది. ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా మానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) ఏప్రిల్‌లో 54.7గా నమోదయ్యింది. సూచీ మార్చిలో 54 వద్ద ఉంది. ఉత్పత్తి, ఫ్యాక్టరీ ఆర్డర్లు, అంతర్జాతీయ అమ్మకాల్లో పురోగతి వంటి అంశాలు సమీక్షా నెల ఏప్రిల్‌లో సూచీ స్పీడ్‌కు కారణమయ్యింది. కరోనా సంబంధ పరిమితులు, ఆంక్షలు సడలింపు కూడీ సూచీ పురోగతికి దోహదపడింది. సూచీ 50 పైనుంటే వృద్ధి సంకేతంగా, ఆ దిగువకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు.   

సానుకూలత కనబడుతోంది... 
భారతీయ తయారీ సూచీ ఏప్రిల్‌లో సానుకూలంగా ఉందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌లో ఎకనామిక్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ పోలియన్నా డి లిమా పేర్కొన్నారు. కర్మాగారాల ఉత్పత్తి వేగం పెరిగిందని తెలిపారు.  అమ్మకాలు, ముడి పదార్థాల కొనుగోలులో కొనసాగుతున్న పెరుగుదల వృద్ధిని సూచిస్తోందని,  సమీప కాలంలో నిలదొక్కుకుంటుందని భావిస్తున్నామని ఆమె అన్నారు.  గణాంకాల ప్రకారం, ఎగుమతుల ఆర్డర్లు కూడా పుంజుకున్నాయి. మరోవైపు ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు పెరిగాయి. కమోడిటీ ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణం. కాగా,  ఉపాధి అవకాశాలు మాత్రం స్వల్పంగా పుంజుకున్నాయి. వ్యాపార విశ్వాస కొంత మెరుగుపడింది. అయితే ఆర్థిక పరిస్థితులు, డిమాండ్‌ పుంజుకుంటాయని కొన్ని సంస్థలు అభిప్రాయపడుతుండగా, అవుట్‌లుక్‌ను ఊహించడం ఇంకా కష్టంగానే ఉందని మరికొన్ని సంస్థలు భావిస్తుండడం గమనార్హం.

మరిన్ని వార్తలు