ఇండియాకు మోడర్నా వ్యాక్సిన్‌!

25 Nov, 2020 14:26 IST|Sakshi

కోవాక్స్‌తో ఒప్పందానికి రెడీ అంటున్న మోడర్నా ఇంక్‌

తద్వారా పేద, మధ్యాదాయ దేశాలకు వ్యాక్సిన్‌ సరఫరా

2-8 డిగ్రీల సెల్షియస్‌లో నిల్వకు వీలు- 30 రోజుల వరకూ ఓకే

దేశీ కంపెనీలతో చర్చలు కొనసాగుతున్నట్లు వెల్లడించిన కంపెనీ 

న్యూయార్క్: కోవిడ్‌-19 కట్టడికి యూఎస్‌ ఫార్మా దిగ్గజం మోడర్నా ఇంక్‌ రూపొందించిన వ్యాక్సిన్‌ పేద, మధ్యాదాయ దేశాలకు అందే వీలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు దేశాలతో చర్చలు నిర్వహిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలియజేశారు. అయితే ఇండియాపేరు ప్రస్తావించనప్పటికీ.. కోవాక్స్‌తోనూ డీల్‌ కుదుర్చుకునే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన కోవాక్స్‌ ద్వారా పేద, మధ్యాదాయ దేశాలకూ వ్యాక్సిన్‌ను సరఫరా చేసేందుకు వీలు చిక్కనున్నట్లు సంబంధితవర్గాలు తెలియజేశాయి. ఇటీవల తమ వ్యాక్సిన్‌ 94.5 శాతం విజయవంతమైనట్లు మోడర్నా ఇంక్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.

తుది దశ పరీక్షల ప్రాథమిక డేటా ప్రకారం ఈ వివరాలు ప్రకటించింది. ఫలితంగా ఎమర్జెన్సీ ప్రాతిపదికన వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతించవలసిందిగా యూఎస్‌ఎఫ్‌డీఏకు దరఖాస్తు చేయనున్నట్లు తెలియజేసింది. ఇప్పటికైతే కోవాక్స్‌తో ఎలాంటి ఒప్పందాన్నీ కుదుర్చుకోదని మోడర్నా వెల్లడించింది. అయితే వీటి ద్వారా ప్రపంచంలో అత్యధిక జనాభాకు వ్యాక్సిన్‌ అందే వీలుంటుందని అభిప్రాయపడింది. ఇండియాలో పంపిణీకి సంబంధించి కొన్ని కంపెనీలతో చర్చలు చేపట్టినప్పటికీ ఎలాంటి ఒప్పందాలూ కుదుర్చుకోలేదని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.

రూమ్‌ టెంపరేచర్‌లోనూ
మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన తమ వ్యాక్సిన్‌ 2-8 డిగ్రీల సెల్షియస్‌లోనూ 30 రోజులపాటు నిల్వ చేయవచ్చని మోడర్నా పేర్కొంది. అంతేకాకుండా సాధారణ రూమ్‌ టెంపరేచర్‌లోనూ 12 గంటలపాటు వ్యాక్సిన్‌ నిలకడను చూపగలదని చెబుతోంది. అయితే దీర్ఘకాలిక నిల్వ, రవాణాలు చేపట్టాలంటే మైనస్‌ 20 డిగ్రీల సెల్షియస్‌లో ఉంచవలసిన అవసరముందని వివరించింది. ఈ ఏడాది చివరికల్లా 2 కోట్ల డోసేజీల వ్యాక్సిన్లను యూఎస్‌కు అందించనున్నట్లు తెలియజేసింది. వచ్చే ఏడాదిలో 50-100 కోట్ల డోసేజీలు సిద్ధం చేయగలమని భావిస్తున్నట్లు వెల్లడించింది. మోడర్నా వ్యాక్సిన్‌ ఒక్కో డోసేజీ విలువ 25-37 డాలర్ల మధ్య ఉండవచ్చని ఫార్మా నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్‌ రెండు డోసేజీలలో వినియోగించవలసి ఉంటుంది. దీంతో దేశీయంగా అత్యంత ఖరీదైన వ్యాక్సిన్‌గా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్‌ నిల్వ, రవాణా తదితర అన్ని ఖర్చులూ కలిపి రూ. 4,000-6,000 మధ్య ధర ఉండవచ్చని అంచనా వేశారు.

మరిన్ని వార్తలు