కోవిడ్‌-19: తొలి దశ వ్యయం రూ. 13,230 కోట్లు!

17 Dec, 2020 14:45 IST|Sakshi

భారత్‌లో తొలి విడత వ్యాక్సిన్ల వ్యయంపై అంచనాలు

రానున్న 6-8 నెలల్లో 30 కోట్ల వ్యాక్సిన్ల పంపిణీ లక్ష్యం

కోవాక్స్‌ మద్దతున్నప్పటికీ ప్రభుత్వంపై పడనున్న భారం

కోవాక్స్‌ ద్వారా గరిష్టంగా 25 కోట్లు- కనిష్టంగా 9.5 కోట్ల వ్యాక్సిన్లు!

న్యూఢిల్లీ, సాక్షి: కోవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు వీలుగా తొలి దశలో దేశీ ప్రభుత్వం 30 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్లను అందించాలని ప్రణాళికలు వేసింది. ఇందుకు అనుగుణంగా రానున్న 6-8 నెల్లలో వ్యాక్సిన్లను సమకూర్చుకోవాలని భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా చూస్తే ఆస్ట్రాజెనెకా, రష్యన్‌ స్పుత్నిక్‌-వి, భారత్‌ బయోటెక్‌, జైడస్‌ క్యాడిలా వ్యాక్సిన్లు అందుబాటు ధరల్లో లభించే అవకాశమున్నట్లు ఫార్మా వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో), గవి(జీఏవీఐ) మద్దతిచ్చే కోవాక్స్‌ పథకంలో భాగంగా పేద, మధ్యాదాయ దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా కానున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం 30 కోట్ల మందికి వ్యాక్సిన్లను అందించేందుకు ప్రభుత్వం అదనంగా 1.4-1.8 బిలియన్‌ డాలర్లమేర వెచ్చించవలసి రావచ్చని గవి వ్యాక్సిన్స్‌ అలయెన్స్‌ తాజాగా అభిప్రాయపడింది. ఇతర వివరాలు చూద్దాం.. (మా వ్యాక్సిన్ సురక్షితం: భారత్‌ బయోటెక్‌)

రెండో దేశం
కోవిడ్‌-19 బారిన పడినవారి సంఖ్య భారత్‌లో దాదాపు కోటికి చేరుతోంది. తద్వారా ప్రపంచంలోనే అమెరికా తదుపరి గరిష్ట స్థాయిలో కరోనా వైరస్‌ బారిన పడిన రెండో పెద్ద దేశంగా నిలుస్తోంది. దీంతో తొలి దశలోనే ప్రభుత్వం 30 కోట్ల మందికి వ్యాక్సిన్లను సరఫరా చేయాలని ప్రణాళికలు వేసింది. ఈ నేపథ్యంలో కోవాక్స్‌ ద్వారా వ్యాక్సిన్లు అందినప్పటికీ ప్రభుత్వం అదనంగా 1.8 బిలియన్‌ డాలర్ల(రూ. 13,230 కోట్లు)వరకూ వెచ్చించవలసి ఉంటుందని గవీ అంచనా వేసింది. 30 కోట్ల మందికి రెండు డోసేజీలను అందించాలంటే 60 కోట్ల వ్యాక్సిన్లు అవసరపడనున్నట్లు పేర్కొంది. కోవాక్స్‌ సౌకర్యాల ద్వారా 19-25 కోట్ల  డోసేజీలవరకూ సరఫరా కావచ్చని అభిప్రాయపడింది. ఇలా అయితే 1.4 బిలయన్‌ డాలర్లు, ఒక వేళ 9.5-12.5 కోట్ల వ్యాక్సిన్లు మాత్రమే లభిస్తే 1.8 బిలియన్‌ డాలర్లను తొలి దశలో వెచ్చించవలసి ఉంటుందని తెలియజేసింది. వ్యాక్సిన్ల పంపిణీ కోసం 3-8 కోట్ల డాలర్లతో అదనపు మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవలసి ఉంటుందని వివరించింది. కాగా.. కేంద్ర ప్రభుత్వం 2020-21 బడ్జెట్‌లో హెల్త్‌కేర్‌ రంగానికి 10 బిలియన్‌ డాలర్లు కేటాయించినట్లు ఈ సందర్భంగా సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కోవాక్స్‌ పథకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ, గవీ మద్దతిస్తున్న విషయం విదితమే. (వారాంతానికల్లా మరో వ్యాక్సిన్‌ రెడీ!)

Poll
Loading...
Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు