ఏఐతో వ్యాపారాల్లో శరవేగంగా మార్పులు

8 Jun, 2023 02:53 IST|Sakshi

చాట్‌జీపీటీ, డాల్‌–ఈ తదితర టెక్నాలజీల ప్రభావం

ఆశావహంగా మెజారిటీ దేశీ కంపెనీలు

బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ సర్వే  

ముంబై: కొత్త తరం జనరేటివ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (జెన్‌ఏఐ) టెక్నాలజీలు వ్యాపార స్వరూపాలను శరవేగంగా మార్చేస్తున్నాయి. చాట్‌జీపీటీ నుంచి డాల్‌–ఈ తదితర సాంకేతికతలు పని ప్రదేశాల్లో చూపే సానుకూల ప్రభావాలపై దేశీయంగా మెజారిటీ కంపెనీలు ఆశావహంగా ఉన్నాయి. బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 18 దేశాల్లో పలు పరిశ్రమలకు చెందిన ఎగ్జిక్యూటివ్‌లు మొదలుకుని ముందు వరుసలో పని చేసే సిబ్బంది వరకూ 12,800 మంది సిబ్బంది ఇందులో పాల్గొన్నారు.

జెన్‌ఏఐ రంగం శరవేగంగా మారుతోందని, ప్రపంచవ్యాప్తంగా పని ప్రదేశాల్లో దానికి సంబంధించిన పరివర్తన ప్రభావాలు స్పష్టంగా తెలుస్తున్నాయని బీసీజీ ఎక్స్‌ (ఏఐ, సాఫ్ట్‌వేర్‌ విభాగం) గ్లోబల్‌ లీడర్‌ నికొలస్‌ డి బెల్‌ఫాండ్స్‌ తెలిపారు. సర్వేలో పాల్గొన్న దేశాలన్నింటిలోనూ భారతీయ ఎగ్జిక్యూటివ్‌లు ఏఐ ప్రభావాలపై అత్యంత ఆశావహంగా ఉన్నట్లు బీసీజీ ఎక్స్‌ ఇండియా హెడ్‌ నిపుణ్‌ కల్రా చెప్పారు. సర్వేలోని ముఖ్యాంశాలు..

► పని ప్రదేశాల్లో జెన్‌ఏఐ ప్రభావాలపై బ్రెజిల్‌ అత్యంత (71%) ఆశావహంగా ఉండగా, భారత్‌ (60%), మధ్యప్రాచ్యం (58%) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అమెరికా (46%), నెదర్లాండ్స్‌ (44%), జపాన్‌ (40%) దేశాల్లో అత్యంత తక్కువ స్థాయిలో ఆశావహ భావం నెలకొంది.
► ఏఐ గురించి ఆందోళనగా ఉన్న దేశాల్లో నెదర్లాండ్స్‌ (42 శాతం), ఫ్రాన్స్‌ (41 శాతం), జపాన్‌ (38 శాతం) ఉన్నాయి. పెద్దగా పట్టించుకోని ప్రాంతాల్లో మధ్యప్రాచ్యం (25 శాతం), బ్రెజిల్‌ (19 శాతం), భారత్‌ (14 శాతం) ఉన్నాయి.
► పని విషయంలో ఏఐ ప్రభావాలపై 2018లో 35 శాతం మంది సానుకూలంగా ఉండగా ప్రస్తుతం అది 52 శాతానికి చేరింది.  
► భారత్‌ నుంచి సర్వేలో పాల్గొన్న 1,000 మంది ఉద్యోగుల్లో 61 శాతం మంది జెన్‌ఏఐ సాధనాలపై ఆశావహంగా ఉన్నారు. జెన్‌ఏఐతో పొంచి ఉన్న రిస్కులతో పోలిస్తే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని 72.8 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఏఐతో తమ ఉద్యోగ విధుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని దాదాపు 88 శాతం మంది భావించగా, ఏఐకి సంబంధించి నిర్దిష్ట నిబంధనలు అవసరమని 80 శాతం మంది అభిప్రాయపడ్డారు.
► సీనియర్‌ లీడర్లు మరింత తరచుగా జెన్‌ఏఐని ఉపయోగిస్తున్నారు. మిగతా ఉద్యోగులతో పోలిస్తే మరింత ఆశావహంగా ఉన్నారు. జెన్‌ఏఐపై వారిలో పెద్దగా ఆందోళన లేదు. 62 శాతం మంది లీడర్లు ఏఐ విషయంలో ఆశావహంగా ఉండగా, ముందు వరుసలో పని చేసే సిబ్బందిలో 42 శాతం మంది మాత్రమే సానుకూలంగా ఉన్నారు. మెజారిటీ లీడర్లు (80 శాతం) మంది తాము జెన్‌ఏఐ టూల్స్‌ను తరచుగా వినియోగిస్తున్నామని తెలపగా, ఇతర సిబ్బందిలో ఇది కేవలం 20 శాతంగానే ఉంది.
► జెన్‌ఏఐని తరచుగా ఉపయోగించే వారిలో 62 శాతం మంది దానిపై ఆశావహంగా ఉండగా, నాన్‌–యూజర్లలో ఇది 36 శాతంగా ఉంది. జెన్‌ఏఐని ఉపయోగించని వారిలో ఎక్కువగా ఫ్రంట్‌లైన్‌ సిబ్బందే (60 శాతం) ఉన్నారు.
► ఏఐ వల్ల తమ ఉద్యోగాలు పోతాయని భావిస్తున్నట్లు అంతర్జాతీయంగా 36% మంది తెలపగా, తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాల్సి ఉంటుందని విశ్వసిస్తున్నట్లు 86% మంది అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు