ప్రజారోగ్యం, సంక్షేమంపై దృష్టి పెట్టాలి

16 Oct, 2020 05:34 IST|Sakshi

భారత్‌కు ఐఎంఎఫ్‌ ఎండీ క్రిస్టాలినా జార్జియేవా సలహా

చిన్న తరహా పరిశ్రమల ప్రయోజనాలను పరిరక్షించాలని సూచన

కోవిడ్‌–19ను ప్రపంచ సంక్షోభంగా అభివర్ణన...

వాషింగ్టన్‌: కోవిడ్‌–19 మహమ్మారితో యుద్ధం చేస్తున్న భారత్‌ తక్షణం ప్రజారోగ్యం, పేద ప్రజల కనీస అవసరాలను తీర్చడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) క్రిస్టాలినా జార్జియేవా పేర్కొన్నారు. అలాగే లఘు, చిన్న మధ్య తరహా ప్రయోజనాల పరిరక్షణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా ఆయా సంస్థలను వ్యాపార పరంగా కుప్పకూలకుండా చూడవచ్చని పేర్కొన్నారు. ఆయా చర్యలతో దీర్ఘకాలంలో దేశాన్ని వృద్ధి బాటలో విజయవంతంగా నడిపించవచ్చని విశ్లేషించారు.   ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్‌ వార్షిక సదస్సు నేపథ్యంలో   ఎండీ మీడియాను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే...

► ప్రపంచదేశాలన్నీ ఆరోగ్య రంగంపై తక్షణం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి గట్టెక్కితే ఎన్నో అవరోధానాలు అధిగమించవచ్చు. అనిశ్చితి, అసంపూర్తి ఆర్థిక రికవరీ పరిస్థితుల నుంచీ బయటపడవచ్చు. 

► కోవిడ్‌–19... ప్రపంచ మానవాళికి ఒక సంక్షోభం. భారత్‌సహా పలు దేశాల్లో మృతుల సంఖ్య తీవ్రంగా ఉంటోంది. 

► సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి భారత్‌ తన శక్తిసామర్థ్యాల మేరకు కృషి చేస్తోంది. ప్రత్యక్ష్య ద్రవ్య పరమైన చర్యలు లేకపోయినా, ఉద్దీపనలతో ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి కృషి చేస్తోంది. అభివృద్ధి చెందిన, చెందుతున్న కొన్ని దేశాల ఉద్దీపనలతో పోల్చితే ఇది తక్కువే. గణనీయమైన ఉద్దీపనలను అందించడంలో భారత్‌ ఆర్థిక వ్యవస్థకు పరిమితులు ఉన్నాయి.  2020లో 10.3 శాతం క్షీణిస్తుందని అంచనావేసిన ఐఎంఎఫ్,  అయితే 2021లో దేశం 8.8 శాతం వృద్ధి నమోదుచేసుకుంటుందని ఇప్పటికే విశ్లేషించింది.  తద్వారా తిరిగి వేగంగా వృద్ధి చెందుతున్న హోదాను దక్కించుకుంటుందని పేర్కొంది.

► కష్టాలు వచ్చినప్పుడు తట్టుకొని నిలబడ్డానికి ప్రపంచదేశాలు తగిన పటిష్ట ఆర్థిక చర్యలను తీసుకోవాలి. అయితే ఇలాంటి పటిష్ట ఆర్థిక మూల స్తంభాలను కష్టాలు రావడానికి ముందే నిర్మించుకోవాలి. ఇది మనకు కరోనా తాజాగా నేర్పిన పాఠం.

‘బ్రెట్టన్‌ వుడ్స్‌’ తరహా పరిస్థితిని ఎదుర్కొంటున్న ప్రపంచం
కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రపంచం కొత్తగా ‘బ్రెట్టన్‌ వుడ్స్‌ సమావేశం’ నాటి స్థితిగతులను ఎదుర్కొంటోందని ఐఎంఎఫ్‌ ఎండీ పేర్కొన్నారు. ఐఎంఎఫ్‌ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్ల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత  భవిష్యత్‌ ఘర్షణల నివారణ, పరస్పర ఆర్థిక సహకారం లక్ష్యంగా పటిష్టమైన ప్రపంచస్థాయి సంస్థలు, ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు 1944లో   అమెరికా, న్యూ హ్యాంప్‌షైర్, కారోల్‌లోని బ్రెట్టన్‌ వుడ్స్‌ ప్రాంతంలో మిత్రపక్ష దేశాలు జరిపిన సమా వేశం అదే ప్రాంతం పేరుతో ప్రసిద్ధమైంది.

ప్రస్తుత పరిస్థితుల్లో తిరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా నిలబెట్టడానికి పటిష్ట చర్యలు అవసరమని పేర్కొంటూ,  ‘‘ప్రస్తుతం మనం బ్రెట్టన్‌ వుడ్స్‌ తరహా పరిస్థితిన ఎదుర్కొంటున్నాం. మహమ్మారి లక్షలాదిమంది ప్రాణాలను బలితీసుకుంటోంది. ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 4.4 శాతం క్షీణతలోకి జారే పరిస్థితి ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 11 ట్రిలియన్‌ డాలర్ల విలువైన ఉత్పత్తి నష్టపోతున్నామన్న అంచనా ఉంది. దశాబ్ద కాలాల్లో మొట్టమొదటిసారి లక్షలాదిమంది పేదరికంలోకి వెళ్లిపోతున్నారు.

మానవాళికి తీవ్ర సంక్షోభ పరిస్థితి ఇది. ఇప్పుడు మన ముందు రెండు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. అందులో ఒకటి కరోనాతో పోరాటం. రెండు అత్యుత్తమైన రేపటిరోజును నేడు నిర్మించుకోవడం. ఈ దిశలో వృద్ధి, ఉపాధి కల్పన, జీవన ప్రమాణాల మెరుగుదల జరగాలి. ఇందుకు పటిష్ట ఆర్థిక విధానాలు, సంస్థలు అవసరం. ప్రపంచ దేశల పరస్పర సహకారం ఇక్కడ ఎంతో కీలకం’’ అని సదస్సును ఉద్దేశించి  ఐఎంఎఫ్‌ ఎండీ అన్నారు.

‘వీ’ నమూనా వృద్ధి కనిపిస్తోంది: నిర్మలా సీతారామన్‌
ఇదిలావుండగా, ఐఎంఎఫ్‌ మంత్రిత్వస్థాయి కమిటీ అయిన అంతర్జాతీయ ద్రవ్య, ఆర్థిక సంఘం (ఐఎంఎఫ్‌సీ) వీడియోకాన్ఫరెన్స్‌ సమావేశంలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ మాట్లాడారు. భారత్‌ ఆర్థిక రంగానికి సంబంధించి పలు విభాగాల్లో ‘వీ’ (ఠి) నమూనా వృద్ధి కనబడుతోందని ఈ సందర్భంగా వివరించారు. దేశ ఆర్థిక పురోగతికి భారత్‌ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఐఎంఎఫ్‌ చేస్తున్న కృషిని ప్రశంసించారు.
   

మరిన్ని వార్తలు