దేశవ్యాప్త లాక్‌డౌన్‌లు పరిష్కారం కాదు: టాటా

20 Apr, 2021 00:16 IST|Sakshi

మరిన్ని వ్యాక్సిన్ల అవసరం

ఉత్పత్తిని భారీగా పెంచాలి 

టాటా సన్స్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌

న్యూఢిల్లీ: భారత్‌కు సాధ్యమైనని కరోనా టీకాల అవసరం ఉందని.. వాటికి లైసెన్స్‌లు ఇవ్వడంతోపాటు.. రెండో విడత ఇన్ఫెక్షన్‌ కేసులు తీవ్రతరం అయిన నేపథ్యంలో టీకాల ఉత్పత్తిని యుద్ధప్రాతిపదికన పెంచాలని టాటా సన్స్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌ అభిప్రాయపడ్డారు. ఏఐఎంఏ నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. కరోనా రెండో విడత ఆందోళన కలిగిస్తోందన్నారు. కేసులను గుర్తించడం, టీకాలు ఇవ్వడం, వ్యాక్సిన్ల సరఫరాను పర్యవేక్షించడం చేయాలన్నారు. దేశవ్యాప్త లాక్‌డౌన్‌లు పరిష్కారం కావంటూ ఆర్థిక వ్యవస్థపైనా ప్రజల జీవితాలపై ఇది ప్రభావం చూపిస్తుందన్నారు.

‘ప్రస్తుత పరిస్థితి నిర్వహణ బాధ్యతలను మీకు అప్పగిస్తే ఎలా వ్యవహరిస్తారంటూ’? ఎదురైన ప్రశ్నకు ఆయన స్పందించారు. ‘‘నిజంగా దీన్ని యుద్ధప్రాతిపదికన నిర్వహించాలి. అవసరమైన పెట్టుబడులను స్వల్ప వ్యవధిలోనే చేయాలి. దాంతో ఉత్పత్తిని పెంచొచ్చు. పెద్ద ఎత్తున ఎలా ఉత్పత్తి చేయగలమో స్పష్టతకు రావాలి. అప్పుడే అవసరాలను చేరుకోగలం’’ అని బదులిచ్చారు. ఒకవైపు ప్రజల ప్రాణాలను పోకుండా చూడడంతోపాటు మరోవైపు ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందంటూ.. దీన్ని చాలా సున్నితంగా ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.  చదవండి: (కరోనాపై ఏం చేద్దాం చెప్పండి..)

మరిన్ని వార్తలు