యూపీఐ, రూపేలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి

20 Mar, 2023 04:49 IST|Sakshi

 ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి

జీ20 అధ్యక్ష స్థానాన్ని ఉపయోగించుకోవాలి

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌

కోచి: భారత్‌లో విజయవంతమైన యూపీఐ, రూపే ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న అభిప్రాయాన్ని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ వ్యక్తం చేశారు. భారత్‌ ఈ విషయంలో తన జీ20 అధ్యక్ష స్థానాన్ని అనుకూలంగా మలుచుకోవాలని సూచించారు. మన దేశంలో రూపొందించిన యూపీఐ చెల్లింపుల వ్యవస్థ ఎంతో విజయవంతమైంది. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత మెరుగైన చెల్లింపుల వ్యవస్థగా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. అందుకే పలు దేశాలు ఈ సాధనం విషయంలో ఆసక్తి చూపిస్తున్నాయి.

‘‘రిజర్వ్‌ బ్యాంక్‌ పేమెంట్స్‌ విజన్‌ 2025 కింద.. ప్రతి ఒక్కరికీ ఈ–చెల్లింపులు, ఎక్కడైనా, ఎప్పుడైనా (4ఈలు) అనే ముఖ్యమైన థీమ్‌కు కట్టుబడి ఉన్నాం. మన చెల్లింపుల ఉత్పత్తులను అంతర్జాతీయం చేసేందుకు ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలి. అప్పుడు మన దేశానికి కొత్త అవకాశాల ప్రపంచం ఏర్పడుతుంది. ఈ ఏడాది జీ20 దేశాలకు భారత్‌ నాయకత్వం వహిస్తోంది. కనుక అంతర్జాతీయంగా అందరి దృష్టికీ మన విజయవంతమైన స్టోరీని తీసుకెళ్లాలి’’అని శక్తికాంతదాస్‌ పేర్కొన్నారు.

అంతర్జాతీయ వ్యవస్థతో అనుసంధానం
అంతర్జాతీయ వ్యవస్థతో భారత ఆర్థిక వ్యవస్థ అనుసంధానత పెరుగుతోందన్నారు. సీమాంతర చెల్లింపులు మరింత ప్రాముఖ్యత సంతరించుకున్నాయని.. మన యూపీఐ, రూపే నెట్‌వర్క్‌ స్థానం అంతర్జాతీయంగా విస్తరిస్తోందని చెప్పారు. దీనివల్ల భవిష్యత్తులో ఇతర దేశాలతో మన చెల్లింపులు, స్వీకరణ లావాదేవీలు మరింత సులభంగా, చౌకగా, వేగంగా జరిగేందుకు వీలు పడుతుందన్నారు. యూపీఐ ద్వారా క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత మర్చంట్‌ చెల్లింపులు ప్రస్తుతం భూటాన్, సింగపూర్, యూఏఈలో అందుబాటులోకి రావడం  గమనార్హం. ఈ విషయంలో మనం ఎంతో సాధించామని, రానున్న రోజుల్లో మరింత చేయాల్సి ఉందని శక్తికాంతదాస్‌ అన్నారు.  

వైఫల్యాలపై దృష్టి సారించాలి..
‘‘విజయవంతం కాని ప్రతీ లావాదేవీ, మోసపూరిత ప్రయత్నాలనేవి కొనసాగితే, ప్రతి ఫిర్యాదును సంతృప్తికరంగా పరిష్కరించకపోతే అది ఆందోళనకరమైన అంశమే అవుతుంది. అప్పుడు మరింత లోతైన విశ్లేషణ చేయాల్సి వస్తుంది. దేశంలో ఎవరూ కూడా డిజిటల్‌ చెల్లింపులకు వెలుపల ఉండకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అని శక్తికాంతదాస్‌ అన్నారు.   
 

మరిన్ని వార్తలు