విమానయానానికి మరింత డిమాండ్‌ ..

26 Mar, 2022 04:58 IST|Sakshi

దక్షిణాసియా మార్కెట్‌లో భారత్‌ కీలకం

దేశీయంగా 20 ఏళ్లలో 2 వేల విమానాలు అవసరమవుతాయి

బోయింగ్‌ వెల్లడి  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కోవిడ్‌పరమైన సవాళ్లు క్రమంగా తగ్గుతుండటంతో దక్షిణాసియాలో విమానయానానికి మరింతగా డిమాండ్‌ పెరగనుందని విమానాల తయారీ దిగ్గజం బోయింగ్‌ కమర్షియల్‌ ఎయిర్‌ప్లేన్స్‌ ఎండీ (రీజనల్‌ మార్కెటింగ్‌) డేవ్‌ షుల్టి తెలిపారు. వ్యాపార అవసరాలు, విహారయాత్రలు మొదలైన వాటి కోసం ప్రయాణాలు చేసేందుకు ప్రజల్లో మళ్లీ ధీమా పెరుగుతోందని, ఎయిర్‌లైన్స్‌ కూడా సర్వీసులను పెంచుతున్నాయని ఆయన చెప్పారు.

దాదాపు 90 శాతం వాటాతో దక్షిణాసియా విమానయాన మార్కెట్లో భారత్‌ కీలకంగా ఉంటోందని వివరించారు. ఈ నేపథ్యంలో రాబోయే 20 ఏళ్లలో భారత ఎయిర్‌లైన్‌ ఆపరేటర్లకు కొత్తగా 2,000 పైగా చిన్న విమానాలు అవసరమవుతాయని డేవ్‌ చెప్పారు. ఇందుకు సంబంధించి దక్షిణాసియా, భారత మార్కెట్‌పై  బోయింగ్‌ రూపొందించిన అంచనాల నివేదికను శుక్రవారమిక్కడ వింగ్స్‌ ఇండియా 2022 కార్యక్రమం సందర్భంగా డేవ్‌ ఆవిష్కరించారు.     


భారత్‌ ఆర్థిక వృద్ధి మెరుగుపడుతుండటం, మధ్య తరగతి వర్గాల పరిమాణం పెరుగుతూ ఉండటం తదితర సానుకూల అంశాల ఊతంతో దక్షిణాసియాలో డిమాండ్‌ పుంజుకోగలదని ఆయన తెలిపారు. ఫలితంగా దక్షిణాసియాలో వచ్చే రెండు దశాబ్దాల్లో ఎయిర్‌ ట్రాఫిక్‌ ఏటా 6.9 శాతం మేర వృద్ధి నమోదు కాగలదని,  కొత్తగా దాదాపు 375 బిలియన్‌ డాలర్ల విలువ చేసే 2,400 కమర్షియల్‌ విమానాలు అవసరమవుతాయని డేవ్‌ పేర్కొన్నారు. 

దూర ప్రాంతాలకు సర్వీసులను మెరుగుపర్చుకోవడానికి విమానయాన సంస్థలు.. ఇంధనం ఆదా చేసే విశిష్టమైన పెద్ద విమానాలపై మరింతగా ఇన్వెస్ట్‌ చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.  ఇందుకోసం దేశీ ఎయిర్‌లైన్స్‌కు బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్‌ తరహా పెద్ద విమానాలు 240 పైగా అవసరం పడవచ్చని వివరించారు. భారత్‌లో కార్గో కార్యకలాపాలు సగటున 6.3 శాతం వార్షిక వృద్ధి సాధించే అవకాశం ఉందని బోయింగ్‌ తన నివేదికలో పేర్కొంది. దేశీయంగా 75 పైగా రవాణా విమానాలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. 

మరిన్ని వార్తలు